తండ్రుల పేరిట పురస్కారాలతో కుటుంబ వ్యవస్థ బలోపేతం

పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

దిశ దశ, కరీంనగర్:

తండ్రుల పేరిట పురస్కారాలు ఇవ్వడం ప్రతిభావంతులను ప్రోత్సాహించడమే కాకుండా కుటుంబ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తుందని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. సమైక్య సాహితీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరిగిన విశిష్ట పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గొప్ప వ్యక్తులకు పురస్కారం అందించడం… ఆయా కళా రంగా్లోల నిష్ణాతులైన వారి పేరిట ఇవ్వడం గొప్ప సంస్కృతి అని అభివర్ణించారు. త‌మ తండ్రుల పేరిట అయిదుగురు మిత్రులు ఆయా రంగాల్లో అవిర‌ళ కృషి చేస్తున్న దిగ్గ‌జాల‌కు ఈ పుర‌స్కారాలు అందించడం అభినందనీయమన్నారు. త‌ల్లి దండ్రుల‌ను, మూలాల‌ను ఎన్న‌టికీ మ‌రువ‌రాద‌నే ఆద‌ర్శాన్ని ఈ పురస్కారాలు చాటుతాయని, నేటి తరానికి కూడా ఆధర్శంగా నిలుస్తుందన్నారు. 2017 నుంచి అందిస్తున్న ఈ పుర‌స్కారాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. పెద్ద‌ప‌ల్లి అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ జి శ్యాంప్ర‌సాద్ లాల్‌, మాడిశెట్టి గోపాల్‌, కేఎస్ అనంతాచార్య‌, రావికంటి శ్రీ‌నివాస్, డాక్ట‌ర్ ర‌ఘురామ‌న్‌లు ఈ పురస్కారాలను ప్ర‌దానం చేశారు. శాలువా, మెమెంటోల‌తో స‌త్క‌రించ‌డ‌ంతో పాటు రూ. 5116/-క్యాష్ అవార్డును కూడా అందించారు.
కరీంనగర్‌కు చెందిన కలకుంట్ల సంపత్ కుమారాచార్యుల పేరిట సంగీత పుర‌స్కారాన్ని ఈ సంవ‌త్స‌రం సంగీత విద్వాంసుడు, తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిని గాయకులుగా తీర్చి దిద్దుతున్న సంగీత గురువు రామాచారికి ప్ర‌దానం చేశారు.ఆచార్య రజనీశ్రీ పురస్కారాన్ని ప్రముఖ పేరిణి నృత్య కళాకారుడు ప్రకాశ్‌కు ప్రదానం చేశారు. మాడిశెట్టి మల్లయ్య స్మారక పురస్కారాన్ని ప్రముఖ పాఠ్యపుస్తక రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, జాతీయవాది గాజుల రవీందర్‌కు ప్ర‌దానం చేశారు. రావికంటి రామయ్య పురస్కారాన్ని ప‌ద్య‌కవి, అవధాని ముద్దు రాజయ్యకు ప్రదానం చేశారు. డాక్టర్ నాగభూషణం స్మారకార్థం పరిశోధన పురస్కారాన్ని తెలంగాణ నవ చరిత్ర పరిశోధకులు ద్యావ‌న‌ప‌ల్లి సత్యనారాయణకు ప్రకటించగా ఆయన ప్రతినిధికి అందజేశారు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You cannot copy content of this page