హిడ్మా ఇలాకాలో ఎస్పీ… ఆయన తల్లితో భేటీ…

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇద్దరు కరుడు గట్టిన మావోయిస్టు పార్టీ నాయకుల గ్రామమది. కీకారణ్యంలో జిల్లాకు సరిహద్దున ఉన్న ఈ గ్రామం నక్సల్స్ కు షెల్టర్ జోన్ కూడా. సుక్మా జిల్లాలోని ఈ అటవీ ప్రాంతంలోకి బలగాలు తరుచూ సెర్చింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ మావోయిస్టులు మాత్రం తమ పట్టును వీడలేదు. జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ జాబితాలో ఉన్న హిడ్మాకు చెందిన ఈ గ్రామంలోకి వెళ్లాలంటేనే బలగాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. ఆ కుగ్రామానికి కూడా చేరుకున్న ఎస్పీ కిరణ్ చవాన్ మిలటరీ ప్లాటూన్ కమాండర్ హిడ్మా ఇంటికి వెళ్లి ఆయన తల్లితో కొద్దిసేపు ముచ్చటించారు. సుక్మా జిల్లాలోని జాగర్ గుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పూర్వర్తి గ్రామానికి ఆదివారం ఎస్పీ అక్కడి ప్రజలతో సమావేశం కూడా కావడం విశేషం.

హిడ్మా ఇలాకా…

మావోయిస్టు పార్టీ మిలటరీ ఆపరేషషన్లలో చురుగ్గా పాల్గొనే హిడ్మా 1996 నుండి పార్టీ కార్యకలాపాల్లో క్రియా శీలకంగా పనిచేస్తున్నారు. మైనర్ గా ఉన్నప్పుడే పీపుల్స్ వార్ బాలల సంఘంలో చేరిన హిడ్మా ఆయా రాష్ట్రాల పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. భారీ లక్ష్యం నిర్దేశించుకుని చేపట్టే ఆపరేషన్లన్నింటికి కూడా హిడ్మానే పర్యవేక్షిస్తాడు. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మందుపాతరలు పేల్చి 76 మందిని మట్టుబెట్టిన ఘటనతో పాటు బుర్కాపాల్ ఏరియాలో 24 మందిని హత మార్చిన సంచలన ఘటనలకు హిడ్మానే వ్యూహకర్త. రూ. 40 లక్షల రివార్డు కూడా ప్రభుత్వం అతనిపై ప్రకటించగా ఆయన పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ముఖ్యమైన వారిలో ఒకరిగా ఎదిగాడు. నాలుగు అంచెల భద్రతా వలయంలో పార్టీ కార్యాకాలపాలను కొనసాగిస్తున్న హిడ్మా పేరు వినగానే బలగాలు అలెర్ట్ అవుతాయి. అంతే కాకుండా మరో మోప్ట్ వాంటెడ్ మిలటరీ ప్లాటూన్ ఇంఛార్జీల్లో ఒకరైన జర్సే దేవా కూడా ఇదే గ్రామానికి చెందిన వాడు. శత్రు దుర్భేద్యంగా ఉన్న ఈ ప్రాంతంలో బలగాలపై మావోయిస్టులు పైచేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ గ్రామానికి కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకోవడం సంచలనంగా మారింది. ఇక్కడ బెటాలియన్ క్యాంపు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న పూర్వర్తికి చేరుకోవడం బలగాలు భారీ సక్సెస్ ను అందుకున్నట్టయిందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్యాంప్ ద్వారా నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించేందుకు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించనున్నారు.

ఎర్రజెండాల స్థానంలో…

ఇంతకాలం ఎర్రజెండాల రెపరెపలాడిన ఆ గ్రామంలో ఎస్సీ కిరణ్ చవాన్ జాతీయ జెండా ఎగురవేశారు. హిడ్మా సొంత గ్రామం కావడంతో ఆక్కడ మావోయిస్టు పార్టీకి అనూకూల వాతవారణం ఉండేంది. దీంతో ఆ గ్రామంలో దశాబ్దాలుగా ఎర్ర జెండాలు మాత్రమే ఎగురేసేవారు. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలప్పుడు నల్లజెండాలు కనిపించేవి. కానీ ఆదివారం ఆ గ్రామంలో జాతీయ జెండా రెపరెపలాడడం విశేషం.

You cannot copy content of this page