దిశ దశ, జాతీయం:
దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలను కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. టెర్రర్ మూలాలతో పాటు తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే విభాగాలు, శాంతి భద్రతలను పర్యవేక్షించే విభాగాల ప్రధాన అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. మల్టీ ఏజెన్సీ సెంటర్ (MAC) పనితీరు గురించి సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అమిత్ షా పలు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏంఏసీ విధి విధానాలతో పాటు దానిని పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న కాలంలో ఆధునిక సాంకేతికతను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, టెర్రర్, తీవ్రవాద సంస్థలను ఏరివేసేందుకు అవసరమైన విధంగా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. భద్రత చర్యల విషయంలో రాజీ పడకుండా ఈ రంగానికి సంబంధించిన అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. డాటాతో పాటు ఏఐ, ఎంఎల్ ఆధారిత విశ్లేషణలు చేయడం, సాంకేతికతను అందిపుచ్చుకుని తీవ్రవాదులను నియంత్రించేందుకు జాతీయ భద్రతతో అనుసంధానంగా ఉన్న అన్ని ఏజెన్సీలు కూడా చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విభాగాల్లో టెక్నాలజీపై పట్టున్న వారిని, యువకులను, దేశ భద్రతలో దూకుడుగా వ్యవహరించే అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించారు.
అంతర్గత భద్రతే ముఖ్యం…
దేశ వ్యాప్తంగా విస్తరించిన టెర్రర్ సంస్థలు, తీవ్రవాద సంస్థలను సమూలంగా అణిచివేసేందుకు జాతీయ స్థాయిలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని సమావేశంలో చర్చించారు. దేశ అంతర్గత భద్రతే ప్రధాన లక్ష్యంగా కార్యాచరణ ఉండే విధంగా ముందుకు సాగాల్సి ఉంటుందని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎంఏసీ క్రియాశీలక పాత్ర పోషించే విధంగా భద్రతను పర్యవేక్షించే ఏజెన్సీలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ఏజెన్సీలు, సైబర్ సెక్యూరిటీతో పాటు నిఘా వర్గాల మధ్య కో ఆర్డినేషన్ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు. దేశ వ్యాప్తంగా కూడా అన్ని విభాగాల మధ్య సమన్వయంతో ఎంఏసీ ముందుకు సాగి… తీవ్రవాదులు, టెర్రర్ సంస్థలను కట్టడి చేయడంలో వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశంలో ఆదేశించారు.