ఇక మండలాల వారిగా అభిప్రాయ సేకరణ

ముగిసిన తొలిదశ విచారణ

చొప్పదండిపై గంగుల, బోయినపల్లి స్పెషల్ ఫోకస్

దిశ దశ, కరీంనగర్:

అభిప్రాయ బేధాలతో అట్టుడికిపోతున్న చొప్పదండి నియోజకవర్గంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది అధిష్టానం. మొదటి దశలో మండలాల వారిగా ఉన్న ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయి అసలేం జరుగుతోంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆరు మండలాల్లోని నాయకుల నుండి పూర్తి స్థాయిలో ఆరా తీశారు. మొదటి విడుత పూర్తయిందని, ఇక మండలాల వారిగా పర్యటించి నాయకులు, ముఖ్య కార్తకర్తల నుండి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఫిర్యాదుల పరంపర…

చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లక్ష్యంగా ఆరు మండలాల్లోని నాయకులంతా కూడా పలు ఫిర్యాదుల చేసినట్టుగా సమాచారం. బుధవారం కరీంనగర్ లోని ఓ హోటల్ లో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ లు చొప్పదండి నియోజకవర్గ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో తమ తమ మండలాల్లో జరుగుతున్న పరాభావాలు కూడా ఎకరవు పెట్టుకున్నట్టు సమాచారం. మండల స్థాయిలో ఉన్న తాము చెప్తే ఏ విభాగానికి చెందిన అధికారి కూడా వినడం లేదని, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నుండి ఫోన్ కాల్ వస్తేనే స్పందిస్తున్నారని పలు మండలాల నాయకులు వివరించారు. అధిష్టానం మాటకు ఎదురు చెప్పకుండా ఏ అభ్యర్థిని బరిలో నిలిపినా తాము వారికి అండగా నిలిచి గెలిపించుకుంటున్నామని, కానీ తమ సొంత గ్రామాల్లో కూడా తమ మాట చెల్లుబాటు కాకపోవడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ అంశాలే అయినా ప్రభుత్వ వ్యవహారాల్లో అయినా తాము నిమిత్త మాత్రులుగా మిగిలిపోయామని, పార్టీ కండువాలు కప్పుకుని నాయకులుగా చెలామణి అవడం తప్ప తమ పతారా మాత్రం ఎక్కడా పనిచేయడం లేదని కొంతమంది నాయకులు మంత్రి గంగుల, బొయినపల్లిల ముందు చెప్పారని తెలుస్తోంది. వన్ మెన్ షో లా నియోజకవర్గం మారిందని వచ్చే ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించేందేకు తాము గ్రామాల్లో ఎలా తిరుగుతామంటూ ప్రశ్నించినట్టు సమాచారం. నియోజకవర్గంలో తమ చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేకుండా పోవడంతో తమ అనుచరులను కూడా కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయిందని, వారికి ఏమైన అవసరాలు ఉన్నా సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేసే అవకాశం లేదని, చిన్న పనైనా పెద్ద పనైనా కూడా ఎమ్మెల్యే జోక్యం చేసుకోవల్సిందే తప్ప మరో అవకాశం తమకు లేదని వివరించినట్టుగా తెలుస్తోంది.

గ్రౌండ్ లెవల్లో ఆరా…

ఇకపోతే గ్రౌండ్ లెవల్లో కూడా ఆరా తీస్తామని మండలాల వారిగా తామే పర్యటించి అక్కడి నాయకులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ లు చొప్పదండి నాయకులతో చెప్పినట్టు సమాచారం. క్షేత్ర స్థాయిలో కూడా నెలకొన్న పరిస్థితులను కూడా తెలుసుకున్న తరువాత అధినేత ముందు ఇక్కడి పరిస్థితులు ఉంచుతామని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై దష్టి సారించాలని, కష్టపడిన వారికి గుర్తింపు లభించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చినట్టు సమాచారం.

You cannot copy content of this page