దండకారణ్యంలో సరికొత్త నిఘా..?

2 వేల నోట్ల రద్దుతో అప్రమత్తం..!

ఇద్దరి అరెస్ట్ తో నిఘా వర్గాల హై అలెర్ట్..!

దిశ దశ, దండకారణ్యం

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న చత్తీస్ గడ్ పోలీసులు ఇకపై బ్యాంకులపై కూడా దృష్టి సారించనున్నారు. తాజాగా అక్కడి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, నిఘావర్గాలు అప్రమత్తం అయ్యాయి. రిజర్వూ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల నోట్లను రద్దు చేయడంతో మావోయిస్టు పార్టీ వాటిని మార్చుకునేందుకు సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జరిగే లావాదేవీలపై నిఘా వేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. గురువారం బీజాపూర్ జిల్లా పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అంశంతో అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. జిల్లాలోని హమ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ ఘాట్ వద్ద బలగాలు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఓ బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో బలగాలు వారిని పట్టుకుని ఆరా తీయడంతో రూ. 2 వేల రూపాయల నోట్ల కట్టలు మూడు లభ్యం అయ్యాయి. మొత్తం రూ. 8 లక్షలు బీజాపూర్ లోని వివిధ బ్యాంకుల్లో వీటిని మార్చుకునేందుకు వచ్చి తిరిగి వెల్తున్న క్రమంలో అక్కడి బలగాలకు చిక్కారు. వీరి నుండి వివిధ బ్యాంకులకు చెందిన 11 పాసు పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు మావోయిస్టులకు సంబంధించిన 2 వేల నోట్లను మార్పిడి చేసుకునేందుకు వచ్చారని పోలీసులు చెప్తున్నారు. నిందితులపై చత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద బీజాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

హై అలెర్ట్…

రూ. 2 వేల నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ వాటిని మార్పుకునేందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు ఇవ్వడంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకో వేరే వాటిని తీసుకునే అవకాశం కల్పించినట్టయింది. దీంతో 2 వేల నోట్లు ఉన్న వారంతా కూడా వాటిని మార్చుకునే పనిలో పడిపోయారు. ఇందులో మావోయిస్టులు కూడా తమ వద్ద ఉన్న కరెన్సీని ఎక్స్ఛేంజ్ చేసుకునే పనిలో పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీజాపూర్ లో పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు పట్టుబడడం వారి వద్ద రూ. 2 వేల నోట్ల బెండిల్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు మావోయిస్టుల సాహిత్యాన్ని కూడా సీజ్ చేశారు. 11 పాసు బుక్కులు కూడా వారి వద్ద ఉండడంతో మావోయిస్టులు 2 వేల నోట్లను చెలామణి చేసుకునేందుకు శ్రీకారం చుట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వేరే నోట్లను ఇప్పటి నుండే సేకరించుకున్నట్టయితే పార్టీకి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురు కావని గుర్తించే 2 వేల నోట్ల మార్పిడి చేసే పనిలో నిగమగ్నం అయినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు.

గత అనుభవాలూ…

2006లో పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీని మార్చుకునే అవకాశం లేకుండా పోయింది చాలా మందికి. మావోయిస్టు పార్టీ కూడా డంపుల్లో దాచిపెట్టిన నగదును వెలికి తీసి నోట్ల మార్పిడీ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో కోట్లాది రూపాయల డబ్బు అందులోనే మగ్గిపోయింది. అప్పుడు చేసిన నోట్ల రద్దు తరువాత ఆర్థిక వనరుల సమీకరణ కోసం మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం భారీ స్కెచ్ వేయాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్థిక వనరులను సేకరించేందుకు ముఖ్య నాయకులు తీవ్రంగా శ్రమించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీ కీలక నేతలు వేసిన వ్యూహాలతో మావోయిస్టులు తొందరగానే నోట్ల రద్దు ఎఫెక్ట్ నుండి పడ్డప్పటికీ ఈ సారి అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వీలైనంత డబ్బును మార్చుకుంటే బావుంటుందని యోచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. బీజాపూర్ వాసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టు పార్టీకి చెందిన వారేనని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ 2 వేల నోట్లను మార్పించుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా అర్థమవుతోంది. అయితే పోలీసులు కూడా మావోయిస్టుల ఆర్థిక మూలాలపై కన్నేసినట్టయితే సత్ఫలితాలు సాధిస్తామన్న యోచనతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుల్లో 2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియపై ఓ కన్నేసీ ఉంచడం బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం.

You cannot copy content of this page