ఒకే గొడుగు కిందకు ఎడ్యూకేషన్ స్కీంలు…

పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకూ సన్నబియ్యం

దేశంలో చదువుకునే విద్యార్థులకూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు…

దిశ దశ, కరీంనగర్:

బీసీ విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఓవర్సిస్ విద్యార్థులకు మాత్రమే అందిస్తున్న విధంగానే దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… శుక్రవారం ఈ స్కీంకు సంబంధించిన విధి విధానలు ఖరారు అవుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిటనే ఈ పధకానికి నామకరణం చేయాలని అభ్యర్థించనున్నామన్నారు. ప్రీ మెట్రిక్ లాగానే పోస్ట్ మెట్రిక్ హస్టల్ విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో భోజనం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్కీంలన్ని కూడా ఒకే గొడుకు కిందకు తీసుకరావాలన్న సంకల్పంతో ఉన్నామని, ఇందుకు అవసరమైన పేరును లోగోను శుక్రవారం లోగా తయారు చేసి విడుదల చేయనున్నట్టు మంత్రి గంగుల ప్రకటించారు. స్వ రాష్ట్ర కల సాకారం కాకముందు బీసీలకు ఉన్నత విద్య అందించడానికి అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నత చదువులు అందుకోలేకపోయారన్నారు. కుల వృత్తులకే పరిమితమైన బీసీలకు విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో 19 బీసీ గురుకులాలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 327కు చేరిందని, గురుకులాల్లో డిగ్రీ పూర్తి చేసే అవకాశం అందుబాటులోకి వచ్చిందని మంత్రి అన్నారు. విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో బీసీలను గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ కు ఎంపికయ్యే విధంగా తీర్చిదిద్దతున్నామన్నారు. బీసీ పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి గంగుల ధన్యవాదాలు తెలిపారు.

You cannot copy content of this page