సీపీ సాబ్ సెల్యూట్… మీ వల్లే మాకు న్యాయం…

దిశ దశ, కరీంనగర్:

సీపీ సాబ్ సెల్యూట్ చేస్తున్నాం సార్… ఇంత కాలం మా గురించి పట్టించుకున్నవారే లేరు… మా దిక్కు చూసిన వారే లేరు కానీ… మీరు జోక్యం చేసుకోవడం వల్లే మాకు న్యాయం జరుగుతోంది సార్… అంటూ వారు పాలాభిషేకం చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తి జరీనా నగర్ వాసులు కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కాలనీకి చెందిన ఇండ్లను కూల్చివేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితులంతా ఆనందంలో మునిగిపోయారు. ఇంతకాలం ఆదుకునే వారు ఎవరోస్తారా అని ఎదురు చూసిన తమకు ఆపద్భాంధవుడిలా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి వచ్చారన్నారు. అనుమతులు తీసుకుని ఇండ్లు నిర్మించుకున్న తమ ఇండ్లను బుల్డోజర్ బ్యాచులొచ్చి కూల్చి వేసిన తరువాత తమను పట్టించుకున్నవారే లేరని వాపోయారు. తమకు బాసటగా ఎంతోమంది వచ్చినా నిందితులు దర్జాగా తిరిగుతుంటే తాము మాత్రం నరకయతాన పడ్డామని జరీనా నగర్ వాసులు వివరించారు. పెద్దల అండదండలు ఉన్న వారిదే పైచేయిగా నిలుస్తుండడంతో చేసేదేమి లేక చేష్లలుడిగి చూస్తూ ఉండిపోయామన్నారు. అయితే తమ ఇండ్లను కూల్చిన వారిపై కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి చర్యలు తీసుకోవడం వల్ల తమలాంటి సామాన్య జనంలో నమ్మకం పెరిగిపోయందన్నారు. ఇలాంటి అధికారులు ఉన్నట్టయితే మాలాంటి అనామకులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న భరోసా వచ్చిందని జరీనానగర్ వాసులు అన్నారు. అలాగే తమ ఇండ్లను కూల్చివేసిన కేసుతో ఇప్పుడు అరెస్ట్ అయిన నిందితులే కాకుండా పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని వాళ్లను కూడా అరెస్ట్ చేయాలని వారు పోలీసులను కోరారు.

ఇండ్లు పూర్తయ్యే వరకూ…

సీపీ మహంతి వల్లే తమ ఇండ్లు కూల్చిన ఐధుగురిని అరెస్ట్ చేశారని సంతోషం వ్యక్తం చేసిన బాధితులు… తాము ఇండ్లు నిర్మించుకునే పరిస్థితులు కూడా కల్పించినట్టయితే తమకు నీడ కల్పించిన వారవుతారన్నారు. నిరుపేదలమైన తమ ఇండ్లపై కన్నేసిన గద్దలు నకిలీ డాక్యూమెంట్లు తయారు చేసుకుని తమను రోడ్డున పడేశారని బాధితులు వివరించారు. ఇప్పటికీ తమ ఇండ్లు అలాగే ఉండిపోయాయని, కూలిపోయిన ఇండ్లు చూసుకుంటూ ఏనాటికైనా తమకు దక్కుతాయన్న ధీమాతో కాలం వెల్లదీస్తున్నామన్నారు. కరీంనగర్ సీపీ చొరవతో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో తమలో ఆశలు చిగురించాయన్నారు.

You cannot copy content of this page