ముగ్గురు అమ్మలు కొలువైన ఆలయం…

దేశంలోనే అరుదైన మందిరం…

సుహసినిలకు కొంగుబంగారం

దిశ దశ, కరీంనగర్:

దేశంలోనే అత్యంత అరుదుగా వెలిసిన ఆలయాల్లో ఇది ఒకటి. ముంబాయి తరువాత కరీంనగర్ లో మాత్రమే నిర్మించిన ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కరీంనగర్ చైతన్యపురిలో 13 ఏళ్ల క్రితం ప్రతిష్టాపన జరిగిన శ్రీ మహాశక్తి ఆలయం భక్తులకు కొంగుబంగారమై నిలుస్తోంది. నేడు వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం…

అరుదైన ఆలయం…

ఒకే ప్రాంగణంలో ముగ్గురు అమ్మవార్లు వెలిసిన ఆలయాలు దేశంలోనే అత్యంత అరుదనే చెప్పాలి. ముంబాయిలో ఒకే గర్భాలయంలో ముగ్గురు అమ్మవార్లు వెలిశారు. అయితే కరీంనగర్ లో ముగ్గురు అమ్మవార్లు ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ వేర్వేరు గర్భాలయాల్లో దర్శనం ఇస్తున్నారు. సువిశాలమైన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయం కరీంనగర్ సిగలో నగగా మారిందని చెప్పవచ్చు. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతిలను ప్రతిష్టించాలని 13 ఏళ్ల క్రితం నిర్ణయించారు. అప్పుడు స్థానిక కార్పోరేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్ ఈ ఆలయాన్ని నిర్మించేందుకు నడుం బిగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవార్లను ప్రతిష్టించాలని పీఠాధిపతులు కూడా సూచించడంతో ఆ మేరకు ప్రత్యేకంగా విగ్రహాలను తయారు చేయించారు. 13 ఏళ్ల క్రితం ప్రతిష్టోత్సవంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవార్లు. విజయాన్ని అందించే శ్రీ మహాదుర్గ అమ్మవారు, భోగ భాగ్యాలు, సిరిసంపదలు అందించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, జ్ఞాన ప్రదాయిని శ్రీ మహాసరస్వతి అమ్మవారు ఒకే చోట కొలైవై ఉన్న ఈ దివ్య మందిరంగా భాసిల్లుతోంది. హంపీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో, దేవాలయ 2010 జూన్ 17న శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి , శ్రీ మహాసరస్వతి, శ్రీ లక్ష్మి గణపతి, అనంత నాగేంద్ర స్వామి సహిత నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్టతో శ్రీ మహాశక్తి దేవాలయం ప్రారంభించారు.

ప్రత్యేక కార్యక్రమాలు…

హిందువులు ఏటా అత్యంత వైభవంగా నిర్వహించుకునే ప్రతి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ధనుర్, శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక మాసాల విశిష్ట తిథుల్లో ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు చేపడ్తారు. వసంత పంచమి, శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు, శ్రీ సీతారాముల కళ్యాణం, ఉగాది పర్వదిన వేడుకలతో పాటు హిందూ సాంప్రదాయ పండుగలన్నింటి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో శాస్త్రోత్తకంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుపుతున్నారు. శివరాత్రి సందర్భంగా శివ పూజ మరియు లింగార్చన, ప్రతి నెల సంకష్టహర చతుర్ధి సందర్భంగా ప్రత్యేక పూజలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కార్తీక మాసంలో సామూహిక సత్యనారయణ వ్రతం, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు, ఓడి బియ్యం సమర్పణ, వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. అలాగే మహిళలు వాయినాలు ఇచ్చుకోవడానికి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రాధాన్యత ఇస్తారు. వినాయక నవరాత్రులు, దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ, శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, మూల నక్షత్రం సందర్భంగా పల్లకి సేవ, తొమ్మిది రోజులు దాండియాతో పాటు, విజయదశమి రోజున షమీ పూజ, వాహన పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దీక్ష తీసుకునే భక్తులు వేలాదిగా ఇక్కడి దేవాలయానికి వచ్చి అర్థ మండలం, మండల దీక్ష చేపడుతున్నారు. అలాగే ఇక్కడి శ్రీ మహాసరస్వతి అమ్మవారు చిన్నారుల అక్షరాభ్యాస స్వీకార మహోత్సవానికి వేదికగా తయారైంది. అన్నప్రాసన వేడుకలు కూడా ఈ ఆలయంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు కూడా శ్రీ మహాశక్తి ఆలయంలోని దేవతా మూర్తుల సమక్షంలో తమ కుటుంబ సభ్యులకు సంబందించిన వేడుకలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సుహాసినీలు కుంకుమార్చనలు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు.

నేడు వార్షికోత్సవ వేడుకలు…

శ్రీ మహాశక్తి ఆలయ త్రయోదశ వార్షికోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. హంపీ పీఠాధిపతులు శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి ఆధ్వర్యంలో నేడు శుక్రవారం రోజున శ్రీ మహాశక్తి దేవాలయ త్రయోదశ వార్షికోత్సవ ఉత్సవాలు జరగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

You cannot copy content of this page