FFC కాలువకు గండి…

గ్రామంలోకి వచ్చిన వరద నీరు

దిశ దశ, మానకొండూరు:

వరద కాలువకు గండిపడడంతో తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. సిద్దిపేట జిల్లా తోటపల్లి రిజర్వాయర్ నుండి చెంజర్ల వరకు ఉన్న ఈ కెనాల్ మీదుగా రాత్రి అధికారులు నీటిని వదిలారు. D4 కెనాల్ కాలువకు గండి పడడంతో మన్నెంపల్లి గ్రామం అంతా కూడా జలమయం అయింది. గ్రామంలోని వీధులన్నీ కూడా ఎస్సారెస్పీ నీటి ప్రవాహంతో నిండిపోయాయి.

గతంలోనూ…

గతంలో కూడా రెండు సార్లు ఇలాగే కాలువకు గండిపడడంతో గ్రామంలోని వరద నీరు వచ్చి చేరిందని గ్రామస్థులు తెలిపారు. తరుచూ ఇదే ఎదురవుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామంలోకి నీరు చొచ్చుకుని రావడంతో పనులకు వెళ్లలేని పరిస్థితి తయారైందని అంటున్నారు.

మెయింటనెన్స్ లేదా..?

కాలువల పటిష్టతపై దృష్టి సారించడంలో విఫలమవుతున్నారో లేక నివేదికలు ఉన్నతాధికారులకు చేరడం లేదో తెలియదు కానీ ఇదే ప్రాంతంలో తరుచూ కెనాల్‌కు గండి పడుతుండడం గమనార్హం. మన్నెంపల్లి పరిసర ప్రాంతాల్లోనే కాలువకు గండి పడుతున్న తీరు వల్ల దిగువన ఉన్న పొలాలకు నీరందే పరిస్థితి లేకుండా పోతోంది. మరోవైపు నీరంతా మన్నెంపల్లి గ్రామంలోకి వచ్చి చేరడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రెండు సార్లు గండి పడినప్పుడే శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితి పునరావృతం కాదని స్థానికులు అంటున్నారు. కాలువల స్థితిగతులపై అంచనా వేయకుండానే నీటిని వదులుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

”బండి” ఫోన్…

తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోకి  నీరు చేరుతోందన్న సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో ఫోన్‌లో మాట్లాడారు. గండి పడిన కాలువకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని, గ్రామంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

You cannot copy content of this page