బ్లాక్ లిస్ట్ ఆధారంగా అధికారుల చర్యలు
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్రంలో బ్లాక్ లిస్టులో ఉన్న గ్రానైట్ క్వారీల్లో తవ్వకాలు నిలిపివేయాలన్న నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపినట్టుగానే ఉంది. వివిధ కారణాలతో గతంలోనే బ్లాకు లిస్టులోకి చేర్చిన ఆయా క్వారీల నుండి గ్రానైట్ రా మెటిరియల్ సేకరించరాదన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ అధికారులు ఆధేశాలు బే ఖాతర్ చేస్తూ బ్లాకు లిస్టులో ఉన్న క్వారీల నుండి కూడా గ్రానైట్ బ్లాకులు వెలికి తీసి వ్యాపారం చేస్తున్నారని మైన్స్ అండ్ జియోలాజి ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ లిస్టులో చేర్చిన గ్రానైట్ క్వారీల్లో అక్రమ మైనింగ్ నిరోధించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 261 క్వారీలు బ్లాక్ లిస్టులో ఉండగా ఆ జాబితాలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 67 క్వారీలు ఉండడం గమనార్హం. ఈ క్వారీల్లో మైనింగ్ కార్యకలాపాలు జరపకూడదని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మైన్స్ అండ్ జియోలాజీతో పాటు ఇతర విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయిన కలెక్టర్ బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో మైనింగ్ జరపకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నాతాధికారులు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమాచారం. అంతేకాకుండా ఆయా క్వారీల్లో ఎంట్రన్స్, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా చేశారు అధికారులు. దీంతో బ్లాకు లిస్టులో ఉన్నగ్రానైట్ క్వారీల్లో తవ్వకాలను ఎక్కడికక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూనిట్లపై ప్రభావం…
బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల కటింగ్, పాలిషింగ్ యూనిట్లపై తీవ్రమైన ప్రభావం పడినట్టుగా ఉంది. ఒకప్పుడు గ్రానైట్ క్వారీ జోన్ లో లారీల రాకపోకలు విపరీతంగా సాగేవి. కానీ గత కొద్ది రోజులుగా రా మెటిరియల్ తరలించే లారీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. మైన్స్ అండ్ జియోలాజీ అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేయడంతో ఆయా క్వారీల్లో గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం కటింగ్ పాలిషింగ్ యూనిట్లపై తీవ్రంగా పడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వెలికి తీసే గ్రానైట్ రా మెటిరియల్ విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇటీవల కాలంలో స్థానికంగా పాలిషింగ్ యునిట్లను ఏర్పాటు చేయడంతో ఇక్కడ కూడా గ్రానైట్ బ్లాకులను విక్రయించే విధానం మొదలైంది. కొన్ని సంవత్సరాలుగా కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీపై వ్యాపారులు దృష్టి సారించడంతో వందల సంఖ్యలో యూనిట్లు ఏర్పాటయ్యాయి. అయితే తాజాగా బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో అక్రమ మైనింగ్ నియంత్రించడంతో ఈ ప్రభావం కటింగ్ యూనిట్లపై పడినట్టుగా సమాచారం. తమకు అవసరమైనంత ముడి సరుకు రావడం లేదని యూనిట్లు నడవడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ యూనిట్లు నిర్విరామంగా నడిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాలిషింగ్ యూనిట్ల సంఘానికి చెందిన పలువురు ప్రతినిధులు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకోవల్సి ఉంటుందని అందుకు భిన్నమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ల యజమానులు మిన్నకుండి పోవల్సి వచ్చింది.
అంత కీలకమా..?
బ్లాక్ లిస్టులో ఉన్న గ్రానైట్ క్వారీల్లో ఇల్లీగల్ మైనింగ్ కార్యకలాపాలకు బ్రేక్ వేయడంతో పాలిషింగ్ యూనిట్లపై ప్రభావం చూపుతోందంటే ఆయా క్వారీల్లో ఏ స్థాయిలో మైనింగ్ జరిగేదో అర్థం చేసుకోవచ్చు. 67 క్వారీల్లో జరిగిన అక్రమ మైనింగ్ వల్ల పాలిషింగ్ యూనిట్లు ఎక్కడికక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి ఎదురయిందంటే వాటి నుండి ఏ స్థాయిలో రా మెటిరియల్ వెలికి తీశారోనన్నది అంచనా వేయవచ్చు. ఈ లెక్కన బ్లాకు లిస్టులో ఉన్న క్వారీలు పాలిషింగ్ యూనిట్ల పరిశ్రమలను శాసిస్తున్నట్టుగా ఉందని స్పష్టం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయా క్వారీల్లో జరిపిన తవ్వకాలపై సమగ్ర గణాంకాల ఆధారంగా ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్వారీలను ఎప్పుడు బ్లాకు లిస్టులో చేర్చారు, ఎంతకాలంగా వాటిలో అక్రమ మైనింగ్ జరుగుతోంది, ఎంత మేర రా మెటిరియల్ తీశారు అన్న వివరాలను సేకరించినట్టయితే పక్కాగా లెక్కలు తేలే అవకాశం ఉంటుందని అంటున్నారు. అక్రమంగా సాగిన మైనింగ్ పై క్వారీల వారిగా చట్టాలను ఉపయోగించినట్టయితే ఒక్క పెనాల్టీ రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. కోట్లలో ఆదాయం వచ్చే అవకాశాలు లేకపోలేదు.