దిశ దశ, ఖమ్మం:
ఖమ్మం లోకసభ ఎన్నికల్లో వారిద్దరు స్టార్ క్యాంపెనర్లుగా మారిపోయారు. ఇంతకాలం బాహ్య ప్రపంచంతో అంతగా సంబంధం లేకుండా కాలం వెల్లదీసిన ఆ ఇద్దరు జనం మధ్యకు వెల్లి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ కలవారి కోడళ్లిద్దరు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటికి తిరగడం ఆరంభించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారిక స్టార్ క్యాంపెనర్లు వేరే అయినా అభ్యర్థి కారణంగా వీరిద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు.
మామ కోసం…
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి బరిలో నిలిచారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కార్యరంగంలోకి దూకిన రఘురామరెడ్డి గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడంతో ఆయన ప్రచారం స్పీడందుకుంది. అయితే అనుకోని అతిథులుగా ఓ ఇద్దరు యవతులు ఖమ్మం ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అభ్యర్థి రఘురామరెడ్డి కోడళ్లు అశ్రిత, స్వప్నిరెడ్డిలు కూడా కాలనీల్లో, అపార్ట్ మెంట్స్ వద్దకు వెల్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. అయితే వీరిద్దరు కాంగ్రెస్ క్యాండెట్ కోడళ్లు కావడం మాత్రమే కాదు మరో స్పెషాలిటీ కూడా వీరి సొంతం. టాలివుడ్ స్టార్ హిరో విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత రఘురామరెడ్డి ఇంటికి పెద్ద కోడలుగా వచ్చారు. ఈ కారణంగానే తన మామ గెలుపుకోసం కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. తన వియ్యంకుని కోసం స్టార్ హిరో వెంకటేష్ కూడా ఈ నెల 7న ఖమ్మంలో ప్రచారం చేయనున్నారు. ఇకపోతే చిన్న కోడలు స్వప్ని రెడ్డి కూడా ప్రత్యేకతలున్న ఫ్యామిలీకి చెందిన వారే. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురే స్వప్నిరెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసినా ప్రచారానికి దూరంగా ఉన్న స్వప్నిరెడ్డి ఇప్పుడు మాత్రం తన మామయ్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు. వీరిద్దరి ప్రచారంతో సినీ స్టార్… పొలిటికల్ స్టార్స్ కూతుళ్లు ప్రచారం చేస్తున్నారన్న చర్చ మొదలైంది.