ఎస్ఓటీ ఆపరేషన్ తో గుట్టు రట్టు…
దిశ దశ, హైదరాబాద్:
ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో ఏడాది కాలంగా స్నేహం చేస్తున్న ఓ యువకుడు ఆదాయం పెంచుకోవాలని భావించాడు. ఇద్దరు ఫేస్ బుక్ స్నేహితుల మధ్య పెరిగిన అనుబంధం కాస్తా అక్రమ వ్యాపారానికి దారి తీసింది. చివరకు చేతికొచ్చిన ఆ వస్తువును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసుల చిక్కి కటకటాల పాలయ్యాడు.
వ్యాపారం ఏంటంటే..?
హైదరాబాద్ లోని జీడిమెట్ల కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్ కు చెందిన గుడ్డి వంశీ కృష్ణ గౌడ్, మధ్యప్రదేశ్ కు చెందిన విశాల్ యాదవ్ కు ఏడాది క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయడం ఏర్పడింది. ఏడాది కాలంలో ఫోన్లో మాట్లాడుకుంటుండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. విశాల్ యాదవ్ తాను గన్స్ సప్లై చేస్తానని వీటిని హైదరాబాద్ లో విక్రయించినట్టయితే భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పాడు. తనకు కూడా ఆదాయం పెరుగుతుందని భావించిన గుడ్డి వంశీ కృష్ణ ఆయుధ వ్యాపారం చేసేందుకు సమ్మతించాడు. ఒక పిస్టల్ కు రూ. 50 వేలు ధరగా నిర్ణయించుకోగా మొదట రూ. 19 వేలు ఫోన్ పేద్వారా విశాల్ యాదవ్ కు వంశీ పంపించాడు. మార్చి 6న మధ్యప్రదేశ్ నుండి విశాల్ యాదవ్ ఖాజీపేటకు వచ్చి పిస్టల్ తీసుకుని వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న వంశీ కృష్ణ తన యాక్టివా వాహనంపై ఖాజిపేటకు వెల్లి రూ. 30 వేలు ఇచ్చి విశాల్ వద్ద నుండి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. కంట్రీ మేడ్ తుపాకిని రూ. 2 లక్షలు, తూటాలకు రూ. 8 వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నెల రోజులుగా దీనిని హైదరాబాద్ లోని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేందుకు వంశీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బుధవారం రాత్రి చింతల్ వద్ద ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో యాక్టివాపై బాలనగర్ వైపునకు వెల్తున్న వంశీ కృష్ణ గౌడ్ ను చెక్ చేశారు. వంశీ వద్ద కంట్రీ మేడ్ తుపాకితో పాటు, మూడు రౌండ్ల తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రాథమిక విచారణలో చెప్పిన విషయాలపై దృష్టి పెట్టిన పోలీసులు వివిధ కోణాల్లో కూడా ఆరా తీస్తున్నారు. ఇదే మొదటి సారి ఆయుధాలు తీసుకొచ్చాడా లే ఇంతకు ముందు ఎవరికైనా అమ్మాడా అన్న విషయం తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.