ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
దిశ దశ, భూపాలపల్లి:
వరద నీటిలో చిక్కుకున్న మోరంచపల్లి వాసులను రక్షించేందుకు వెంటనే ఆర్మీ హెలిక్యాప్టర్ సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెల్లవారు జాము నుండి వాగు నీటిలో దిగ్భంధనం అయిన గ్రామస్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా సాధారణ హెలిక్యాప్టర్ వినియోగించే అవకాశం లేనందున ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఆర్మీ ఉన్నతాధికారులు అనుమతించిన తరువాత హకీంపేట నుండి స్పెషల్ హెలిక్యాప్టర్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ సానుకూల వాతావరణం కనిపించకపోవడంతో ఆర్మీ హెలిక్యాప్టర్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం.
ఆహారం సరఫరా…
మోరంచపల్లి వరద నీటిలో చిక్కుకున్న బాధితుల కోసం ప్రత్యేకంగా ఆహారంతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా బయటకు వచ్చిన వారికి వెంటనే ఆహారం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మరికొన్ని బృందాలు వరద నీటిలో చిక్కుకున్న వారిని ఇండ్లపైకి తరలించి తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించారు. వారికి కూడా ఆహారం, తాగు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్థులందరిని సురక్షితం ప్రాంతాల్లో ఉంచేందుకు రెస్క్యూ టీం ప్రత్యేక దృష్టి సారించింది.