ఇందిరమ్మ పార్టీలో ఇందిర ప్రకంపనలు…

స్టేషన్ ఘన్ పూర్ పాలిటిక్స్…

దిశ దశ, వరంగల్:

రాష్ట్ర రాజకీయాలకు వేదికగా మారిందా నియోజకవర్గం. అందరి దృష్టి ఆ సెగ్మెంట్ పైనే పడింది. ఆ నాయకురాలి చర్యలు సొంత పార్టీలో సంచలనంగా మారగా… అధిష్టానం ఎలా వ్యవహరిస్తోందన్నదే హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలకు వేదికగా మారిన స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంగా అసలేం జరుగుతోంది..?

కడియం ఎంట్రీతోనే…

స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యల జాయినింగ్ తో అగ్గిరాజుకుందని చెప్పాలి. అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కడియం విషయంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ పార్టీని మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతుంటుంటే… ఆయనను పార్టీలోకి ఎలా రానిస్తారంటూ కాంగ్రెస్ శ్రేణులు అడ్డుపుడుతున్నాయి. దీంతో కడియం కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

తాటికొండ… కడియం…

అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీని మొదట విబేధించి బయటకు వచ్చిన తాటికొండ రాజయ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచూతూచి అడుగేసింది. ఆయన పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలన్ని కూడా విఫలం అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన తాటికొండ రాజయ్య అధిష్టానం తీరుపై కామెంట్ చేసి రాజీనామా చేశారు. ఆ తరువాత ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకూ ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసినప్పటికీ ఆయన చేరిక విషయంలో మాత్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. అదే కడియం శ్రీహరి విషయంలో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరిని ఆశ్యర్యంలోకి ముంచెత్తుతోంది. గురువారం రాత్రి వరంగల్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరిస్తున్నానని, పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని కడియం కావ్య ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం మద్యాహ్నం కల్లా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దీప్ దాస్ మున్షీ కడియం వద్దకు వెల్లి మరీ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది.

ఇందిర ఫైర్…

అయితే కడియం శ్రీహరి విషయంలో స్టేషన్ ఘన్ పూర్ ఇంఛార్జి ఇందిర మాత్రం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఆమె తన సొంత సెగ్మెంట్ రాజకీయాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చి చెప్తున్నారు. శుక్రవారం హుటాహుటిన అందుబాటులో ఉన్న పార్టీ శ్రేణులతో సమావేశం అయిన ఇందిర నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకుంటున్న కడియం శ్రీహరిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నిస్తున్న ఇందిర ఇంఛార్జి దీప్ దాస్ మున్షిని కూడా కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాటికొండ రాజయ్య జాయినింగ్ విషయంలో కూడా ఇందిర అనుమతి లేకుండా తాము చేర్పించుకోలేమని అధిష్టానం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే కడియం విషయంలో మాత్రం ఆమెతో సంబంధం లేకుండానే చేర్పించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా స్ఫస్టం అవుతోంది. మరికొద్ది సేపట్లో కడియం అదికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో అధిష్టానం ఇందిర అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారా లేక… ఆమెను బుజ్జగిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

You cannot copy content of this page