దిశ దశ, కాటారం:
జిరో దందా, ఓవర్ లోడ్ వంటి అక్రమ వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా జీరో దందా మాత్రం ఆగడం లేదు. ఇసుక రీచుల కేంద్రంగానే ఇసుక అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాటారం సబ్ డివిజన్ పోలీసులు జీరో ఇసుక లారీల కట్టడి కోసం దాడులు చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాటారం సర్కిల్ పరిధిలో దాదాపు ఆరు లారీలను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మల్హర్ మండలంలోని ఇసుక రీచుల నుండి ఇవి వేబిల్లులు లేకుండా తరలిపోతున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కాటారం పోలీసులు డ్రైవర్లను విచారిస్తున్నట్టుగా సమాచారం.
కిటుకు నేర్చిన కాంట్రాక్టర్లు…
టీఎస్ఎండీసీ నిబంధనల ప్రకారం ప్రతి రీచులో కూడా సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలన్న నిభందన ఉంది. అయితే ఏ రీచులో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో జీరోగా తరలి వెల్తున్న ఇసుక ఎక్కడి నుండి తరలి వెల్తుంది అన్న విషయంపై క్లారిటీ ఉండదు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు చెప్పే సమాచారంతో విచారించే ప్రయత్నించిన తమ రీచు నుండి అక్రమంగా తరలి వెల్లడం లేదని తప్పించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అధికారులు రీచులను పర్యవేక్షించినా అక్కడ లారీలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండవు కాబట్టి తాము సేఫ్ జోన్ లోనే ఉంటామని రీచుల నిర్వాహాకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే జీరో దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవంగా రీచుల నుండి తరలి వెల్లే ఇసుక లారీల రికార్డులు కూడా ఖచ్చితంగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు రీచుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విధానమే అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదునుగా భావించి ఇష్టారీతిన జీరో దందా నిర్వహిస్తున్నారని స్ఫష్టం అవుతోంది. వీటిని పర్యవేక్షించేందుకు నియమించిన టీఎస్ఎండీసీ యంత్రాంగం అంతా కూడా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండి పడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను కూడా నియమించుకున్నప్పటికీ రీచుల్లో మాత్రం అక్రమాల తంతుకు బ్రేకులు పడడం లేదు. దీంతో అటు జీరో దందాతో ఆదాయం నష్టపోతుండగా, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఇస్తూ టీఎస్ఎండీసీ మరింత ఆర్థిక భారాన్ని భరిస్తోంది. వీరిపై ఎప్పటికప్పుడు అజమాయిషీ చేయాల్సిన పీఓలు కూడా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ దందాపై సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేసినా చాలా మంది పీఓలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరన్న విమర్శలు కూడా ఉన్నాయి.
బారీ నెట్ వర్క్…
ఇకపోతే జీరో దందా గాళ్ల నెట్ వర్క్ కూడా భారీగానే ఉంటోంది. ఇసుక తరలించే లారీలకు పైలెట్, ఎస్కార్ట్ వాహనాలు కూడా ఉంటాయి. ఈ వాహనాల్లో తిరిగే వారు పోలీసుల దాడులను, విజిలెన్స్, రవాణా శాఖల అధికారులు చెకింగ్ విషయాలను గమనిస్తూ లారీలను ముందుకు నడిపిస్తుంటారు. హైదరాబాద్ చేరే వరకూ కూడా పైలెట్ ఎస్కార్ట్ వాహనాలు జీరో ఇసుక లారీలకు సెక్యూరీటీ ఇస్తుంటాయి. మరో వైపున ఎక్కడైనా అధికారులు కట్టడి చర్యలు చేపట్టారంటే ఆ విషయం వెంటనే మరో టీమ్ కు సమాచారం వెల్తుంటుంది. లారీలను క్షేమంగా తరలించేందుకు ఎస్కార్ట్ గా ఉండే వాహానాల్లోని వారు జీరో దందా చేసే ఇతర లారీలను మానిటరింగ్ చేసే గ్యాంగుకు సమాచారం చేరవేస్తారు. వెంటనే ఆ లారీల్లోని ఇసుకును ఎక్కడపడితే అక్కడ డంప్ చేసి తప్పించుకునే విధంగా స్కెచ్ వేశారు. శనివారం రాత్రి కాటారం సబ్ డివిజన్ పోలీసులు జీరో ఇసుక లారీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న మిగతా జీరో లారీలు ఎక్కడికక్కడ ఇసుకను డంప్ చేసేశాయి. మల్హర్ మండలంలోని మల్లారం, తాడిచెర్ల దారిలో అక్రమంగా తరలి వెల్తున్న ఇసుక లారీలకు పోలీసుల దాడుల సమాచారం అందగానే రోడ్డు పక్కనే ఇసుకను డంప్ చేసి మిగతా లారీలు వెల్లిపోయాయి. మరికొన్ని లారీల్లో జీరో ఇసుక లోడ్ చేయకుండా నిలిపేశారు. అయితే ఈ జీరో దందాను కట్టడి చేసేందుకు రీచుల కేంద్రీకృతంగానే కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.