ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై అనూహ్యరీతిలో రాళ్ల దాడి జరిగింది. ఓ ప్రొగ్రాంలో పాటలు పడి వస్తున్న ఆమెపై ఈ ఎటాక్ జరిగింది. వందల మంది ఒక్కసారిగా రావడంతో మంగ్లీ ప్రాణాలను అర చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలో శనివారం రాత్రి ఈ దాడి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి బళ్లారి ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి పునిత్ రాజ్ కుమార్ భార్య అశ్విని, సీనియర్ నటుడు రాఘవేంద్ర కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ ప్రొగ్రామ్‌లో పాటలు పాడేందుకు వెళ్లిన మంగ్లీకి చేదు అనుభవం ఎదురైంది. వేదిక మీదికి వచ్చిన మంగ్లీ.. తెలుగులోనే అందరికీ నమస్కారం అంటూ వందనం చేసింది. ఆ సమయంలో యాంకర్ అనుశ్రీ కల్పించుకొని కన్నడంలో మాట్లాడాలని కోరింది. అయితే మంగ్లీ రెండు, మూడు పదాలు కన్నడంలో మాట్లాడి బళ్లారి అనంతపురం పక్కన్నే ఉన్నందున ఇక్కడి వారందరికీ తెలుగు వస్తుందంటూ తన మాతృభాషలోనే పాటలు పాడింది. ఆ తర్వాత వేదిక వెనకలా ఉన్న టెంట్ రూంలోకి వెళ్లిన మంగ్లీని గమనించిన యువకులు ఆమె కోసం టెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టి మంగ్లీని కారులో తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా వందల మంది ఎదురుగా వచ్చారు. పోలీసులు వారిని అదుపు చేయాలని ప్రయత్నించిన క్రమంలో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహం చెందిన యువకులు మంగ్లీ కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వాళ్లను చెదరగొట్టి మంగ్లీని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.