మానేరు ఇసుక రీచులను నిలిపివేయండి… ప్రజా భవన్ లో ఫిర్యాదు…

దిశ దశ, హైదరాబాద్:

త్తర తెలంగాణాలోని మానేరు నది పరివాహక ప్రాంతం మీదుగా జరుగుతున్న ఇసుక దోపిడీని కట్టడి చేయాలని కోరుతూ ప్రజా భవన్ లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నది నుండి ఇసుకను తరలించేందుకు దాదాపు 30 రీచుల వల్ల ప్రభుత్వానికి గోరంత ఆదాయం వస్తుంటే కొండంత నష్టం వాటిల్లుతున్నదని వారు ఆ ఫిర్యాదులో వివరించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తికి చెందిన చిటికేశి సతీష్, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన సంధి సురేందర్ రెడ్డిలు శుక్రవారం ప్రజా భవన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మాణ దశలోని వరదలకు కొట్టుకపోయిన చెక్ డ్యాంల వద్ద డిసిల్ట్రేషన్ పేరిట ఇసుక రీచులను ఏర్పాటు చేసి పర్యావరణ నిభందనలు తుంగలో తొక్కారని వారు ఆ ఫిర్యాదులో వివరించారు. ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లేకుండానే అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక దోపీడీపై సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని, ఎన్జీటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా కాదని ఇసుక దందా కొనసాగిస్తున్నారని వారు ఆ ఫిర్యాదులో వివరించారు. ఎన్నికల నిభందనలను ఉల్లంఘించి కరీంనగర్ కలెక్టర్ ఇసుక రీచులను కొనసాగించుకోవచ్చని గడువు పొడగించారని వివరించారు. ఇసుక రీచుల వల్ల మానేరు పరివాహక ప్రాంతం అంతా కూడా విధ్వంసానికి గురైందని, అటు నదిలో ఇసుక తరలిపోతుండగా ఇటు పరివాహక గ్రామాలు లారీల రాకపోకలతో కాలుష్యం కోరల్లో చిక్కుకకపోయాయని తెలిపారు. టీఎస్ఎండీసీ అధికారులు, సంస్థ మాజీ చైర్మన్, కాంట్రాక్టర్లు చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సతీష్, సురేందర్ రెడ్డిలు అభ్యర్థించారు. మానేరు నదిలో జరిగిన విధ్వంసంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి వాస్తవాలను పరిశీలించి బాధిత రైతాంగాన్ని ఆదుకునేందుకు చొరవ తీసుకోవలని కోరారు. మానేరు నదిలో చెక్ డ్యాంలను నిర్మించి భూగర్భ జలాల వృద్ది కోసం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. ప్రగతి భవన్ పెద్దల సహకారంతో రెండేళ్లుగా మానేరు నదిలో ఇసుక తరిలించిన మాఫియా వేలాది కోట్ల రూపాయలను గడించిందని వారు ఆరోపించారు. బాధిత రైతాంగం ఇదేంటని ప్రశ్నిస్తే ఉక్కుపాదం మోపారు కానీ వారికి ఎలాంటి న్యాయం చేయలేదని వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని తనుగుల వద్ద పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారని… ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టయితే మానేరు నదిని పరిరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు అవుతుందన్నారు.

 

 

 

 

You cannot copy content of this page