ఈసీ ఉంటే ఓకె లేనట్టయితే క్లోజ్ చేయాల్సిందే
కలెక్టర్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిందే: ఎన్జీటీ
దిశ దశ, భూపాలపల్లి:
టీఎస్ఎండీసీకి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచ్. ఇప్పటి వరకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని మానేరు నదిలో సేకరిస్తున్న ఇసుక తవ్వకాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన బెంచ్ తాజాగా భూపాలపల్లి జిల్లా విషయంలోనూ ఇవే నిర్ణయాన్ని వెల్లడించింది. డీ సిల్టేషన్, డ్రెడ్జింగ్ పేరిట చట్ట విరుద్దంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, కమర్షియల్ అవసరాలకు రీచులను ఏర్పాటు చేశారని ఎన్జీటీలో వేసిన పిటిషన్ ను విచారించి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ) ఉన్నట్టయితే ఇసుక తవ్వకాలు యథావిధిగా జరుపుకోవచ్చని, లేనట్టయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ మైనింగ్, డి సిల్టేషన్ కార్యకలాపాలు కొనసాగించవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని లేనట్టయిందే కలెక్టరే భాధ్యత వహించాల్సి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఓఏ నెంబర్ 68/2023(SZ) పిటిషన్ పై చెన్నై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
ఈసీ ఎంత పనిచేసిందో..?
తెలంగాణ రాష్ట్రంలోని నదుల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ చట్టాలు కట్టడి చేస్తున్నాయని చెప్పక తప్పువు. పెద్దపల్లి జిల్లాలో మానేరు పరిరక్షణ సమితి ఎన్జీటీని ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ బెంచ్ ముందు దాఖలు చేసే వరకూ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో కొంతకాలం యథావిధిగా నడిపించినప్పటికీ మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని బెంచ్ కు తెలిపారు. దీంతో ఉల్లంఘింస్తున్నట్టుగా ఆధారాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని చెన్నై బెంచ్ పిటిషనర్లకు సూచించింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలోని చాలా రీచులను పొరుగు జిల్లాలకు తరలించి ఇసుక తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ కేసు విచారణ జరుపుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా విషయంలోనూ ఎన్జీటిలో పిటిషన్ వేయగా ఈసీ వచ్చేవరకు ఇసుక రవాణా చేయకూడదంటూ రీచుల వివరాలను స్పష్టంగా పొందుపరిచి ఆదేశాలు జారీ చేసింది. అయితే టీఎస్ఎండీసీ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఆర్డర్ తీసుకుంది. తాజాగా భూపాలపల్లి జిల్లాలోని మానేరు, గోదావరి నదుల్లో డిసిల్టేషన్, డ్రెడ్జింగ్ పేరిట ఇసుక మైనింగ్ నడుస్తోందని పిటిషన్లు ఎన్జీటీని ఆదేశించడంతో ఈసీ లేనట్టయితే వెంటనే మైనింగ్ నిలిపివేయాలని బెంస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లేనట్టయితే జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని ఎన్జీటీ ఆ ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. దీంతో ఈ జిల్లాలోని మానేరు, గోదావరి నదుల్లో కూడా ఇసుక తవ్వకాలు నిలిపివేయాల్సిన పరిస్థితి తయారైంది.
మరిన్ని జిల్లాల్లోనూ…
పర్యవారణ అనుమతులకు సంబంధించిన అంశంపై నదులు ప్రవహిస్తున్న జిల్లాల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని కోరుతూ ఎన్జీటీలో పిటిషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎక్కడికక్కడ బ్రేకులు వేయాల్సిన పరిస్థితి ఎదురు కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన ఇసుక అమ్మకాలు ముందు ముందు కష్టతరం కానుంది.