దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచులను కూడా నిలిపివేయాలని పెద్దపల్లి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ఇసుక రీచులను రద్దు చేయాలని ఓదెల మండలం కనగర్తికి చెందిన చిటికేశి సతీష్, వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన సంధి సురేందర్ రెడ్డిలు వినతి చేశారు. మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన వీరు ఇటీవల కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇసుక రీచులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. 8 రీచుల్లో ఇసుక తవ్వకాలు కానీ, రవాణా కానీ చేయవద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసిడింగ్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇదే విధానాన్ని పెద్దపల్లి జిల్లాలోనూ అమలు చేసి జిల్లాలో నిర్వహిస్తున్న ఇసుక రీచులను మూసివేయించాలని అభ్యర్థించారు. స్టాకు యార్డుల్లో నిలువ ఉంచిన ఇసుకను సీజ్ చేసి మానేరు నది నుండి ఇసుక తవ్వకాలు జరుపుతున్న మిషనరీని కూడా తిప్పి పంపించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆ వినతి పత్రంలో సతీష్, సురేందర్ రెడ్డిలు కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలు జరపకూడదని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న టీఎస్ఎండీసీ అధికారులు ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ చట్టాలను ఉల్లంఘిస్తూ జ్యుడిషరీ వ్యవస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.