దిశ దశ, కరీంనగర్:
గవర్నర్ కోటాలో నామినేటె అయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి. ఇటీవలె ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే తాము హై కోర్టులో వేసిన పిటిషన్లు విచారణలో ఉన్నందున ఇద్దరి నామినేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు అభ్యర్థించారు. ఈ మేరకు వాదనలు విన్న హై కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని ఆదేశించింది.
కలిసి రావడం లేదా..?
ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి నియామకం కోసం అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినప్పటి నుండి కూడా ఎధో రకమైన అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. గవర్నర్ కోటలో నామినేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. ఆ తరువాత దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో పంపించడంతో వారి పేర్లను ఆమోదించేందుకు నిభందనలు సహకరించడం లేదని గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుండి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పెండింగ్ లో పడిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ల పేర్లను ప్రతిపాదంచింది. ఈ మేరకు వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేఫథ్యంలో కోదండరాం, అమిర్ అలీ ఖాన్ లు త్వరలో బాధ్యతలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే మంగళవారం తెలంగాణ హై కోర్టు వీరి ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు నిలుపుదల చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి8కి వాయిదా వేసింది హైకోర్టు. అయితే వరసగా మూడు సార్లు చేసిన ప్రతిపాదనలకు ఏదో ఒకరకమైన అవాంతరాలు ఎదురు కావడం గమనార్హం.