కర్రి గుట్టలపై చేపట్టిన ఆపరేషన్ నిలిపివేయండి… రూపేష్ డిమాండ్

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్రి గుట్టలపై బలగాలు చేపట్టిన ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఇంఛార్జి రూపేష్ అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవ రావు కోరారు. ఈ మేరకు విడుదల అయిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలని, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు ఎప్పుడూ సిద్దంగానే ఉందని, ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా ఈ అంశంపై లేఖ రాసిందన్నారు. చర్చల ద్వారా పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణిచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తోందని, దీని ఫలితంగానే బీజాపూర్, తెలంగాణ సరిహధ్దుల్లో చేపట్టిన భారీ ఎత్తున సైనిక ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని రూపేష్ కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి సానుకూల వాతావరణాన్ని కల్పించాలని రూపేష్ అభ్యర్థించారు. తుపాకితో సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను నెల రోజుల పాటు వాయిదా వేయాలన్న ఈ విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆ ప్రకటనలో వ్యక్తం చేశారు.

You cannot copy content of this page