దిశ దశ, మంథని:
కుల దృవీకరణ పత్రం నుండి స్కాలర్ షిప్ వరకు ఇలా ప్రతి అవసరానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లక తప్పదు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తరువాతే సంబంధిత కార్యాలయాల నుండి దృవీకరణ పత్రాలు జారీ అవుతాయి. ఈ సర్టిఫికెట్లు కూడా మీ సేవా కార్యాలయాల నుండే తీసుకోవాల్సి ఉంటుంది. సుమారు 40 రకాల సేవలందిస్తున్న మీ సేవా కేంద్రాలు 24 గంటలకు పైగా సేవలందించలేకపోతున్నాయి. మీకు సేవ అందించ పరిస్థితిలో లేమని మీ సేవా కేంద్ర నిర్వహాకులు వాటిని మూసి వేసేశారు. ఓ వైపున కొన్ని స్కాలర్ షిప్ దరఖాస్తులకు చివరి తేది ముగుస్తున్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే భూ సంబంధిత రికార్డులు, ఇతరాత్ర అవసరాల కోసం మీ సేవా కేంద్రాలకు వెలుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సాంకేతిక కారణాల వల్ల మీ సేవా కేంద్రాల్లో సేవలు అందించే పరిస్థితి లేకుండా పోయిందని తెలుస్తోంది. అయితే సాంకేతిక సమస్య పరిష్కారం అయ్యే వరకు చివరి తేది ముగిసిన తరువాత తమ దరఖాస్తులు స్వీకరించే పరిస్థితి ఉండదన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతోంది. రెవెన్యూ కార్యాలయాల నుండి తీసుకోవల్సిన దృవీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఎదురుకావడంతో మీ సేవా కేంద్రాలు అన్ని కూడా సేవలందించలేకపోతున్నాయి. సర్వర్ లో లోపాలు తలెత్తాయని, అప్ డేట్ చేసే పనిలో యంత్రాంగం నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.