నాడు మేఘాలు… నేడు పంచ భూతాలు…
దిశ దశ, వరంగల్:
కీకారణ్యాలకు పెట్టింది పేరైన ములుగు జిల్లాలోనే తరుచూ ప్రకృతిలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. సహజ వనరుల ఖిల్లా అయిన ములుగు జిల్లాలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన విచిత్ర విన్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే వాటర్ ఫాల్స్ నయగరాలను తలపిస్తుంటే… ఆకాశం కూడా అప్పుడప్పుడూ తనలోని వైవిద్యతను ప్రదర్శిస్తోంది. తాజా ఘటనతో ములుగు జిల్లా అడవుల్లో అసలేం జరుగుతోంది అన్న చర్చ సాగుతుండగా… గతంలో కూడా ఇలాంటి అనుభవాలను స్థానికులు చవి చూశారు.
2019లో
2019 జులై 9, 10వ తేదిల్లో ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్ ప్రాంతాల్లో ఎదురైన అనుభవం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడు మేఘాలు భూమిని తాకినట్టుగా కిందకు వచ్చి చేరాయి. పలు గ్రామాల మీదుగా అంత్యంత ఎత్తున ఉండాల్సిన మేఘాలు నేలను తాకినంత పని చేశాయి. పంట పొలాల్లో పనికి వెల్లిన వారు… ఇతర ప్రాంతాల్లో తిరిగిన వారంతా కూడా భూమిని తాకుతున్నట్టుగా కనిపించిన మేఘాలను చూసి భయాందోళనకు గురయ్యారు. మంచు పర్వతాలు, అతి శీతల ప్రాంతాలను మరిపించే విధంగా ఏటూరునాగారం సమీపంలో మేఘాలు ధరణికి చేరువగా కొన్ని గంటల పాటు ప్రయాణించాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ప్రకృతి మార్పులను గమనించిన స్థానికులు అసలేం జరుగుతోంది అని చర్చించుకున్నారు. కొన్ని చోట్ల తెల్లని మబ్బులు, మరికొన్ని చోట్ల నల్లని మేఘాలు భూమిని తాకినంత పనిచేశాయి. అయితే కొన్ని గంటల తరువాత ఈ మేఘాలు ఆకాశం వైపు పయనించడంతో ఈ ప్రాంత వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు…
2014 ఆగస్టు 31 సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఇదే ములుగు జిల్లాలో ప్రకృతి మరో విన్యాసం చేసింది. తాడ్వాయి నుండి మేడారం అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర అడవులు నేలమట్టం అయ్యాయి. ఆరోజు కురిసిన భారీ వర్షం కారణంగా ఈ అటవీ ప్రాంతమంతా కూడా జలమయం అయ్యాయి. భూమిపై ఉన్న నీరు ఆకాశాన్ని తాకుతూ సుడులు, సుడులుగా తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టించాయి. అదే సమయంలో స్కూలు విద్యార్థులను గమ్యం చేర్చేందుకు వెల్లిన ఓ బస్సు డ్రైవర్ అక్కడ జరుగుతున్న బీభత్సాన్ని గమనించి తాడ్వాయికి తిరుగు ప్రయాణం అయ్యారు. జలశయాలు, నది ప్రవాహాలు ఉండే ప్రాతంలో మాత్రమే కనిపించే వాటర్ స్పౌట్స్ తాడ్వాయి సమీపంలో ఏర్పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏక కాలంలో క్లౌడ్స్ బ్రస్ట్ కావడంతో పాటు వాటర్ స్పౌట్స్, అత్యంత వేగంతో వచ్చిన గాలులు కూడా వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇవి సృష్టించిన బీభత్సంతో 5 వేల ఎకరాల్లోని చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని చెట్లు రెండుగా చీలిపోగా, మరికొన్ని వడి పెట్టినట్టుగా చుట్టుకపోయాయి. మూడు, నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడు వాతావరణంలో ఇలాంటి మార్పులను తాము చూడలేదని అటవీ అధికారులు చెప్తున్నారు. ప్రత్యక్ష్యంగా గమనించిన వారు చెప్తున్నదాన్ని బట్టి గమనిస్తే… అతి వేగంతో గాలులు వీసినట్టుగా చెప్తున్నారు.
అత్యంత అరుదైన ఘటనే…
ములుగు జిల్లా తాడ్వాయిలో తాజాగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల ప్రభావం ప్రపంచంలోనే అరుదైన ఘటనగా భావిస్తున్నారు. ఇలాంటి ఘటన దాదాపు 20 ఏళ్ల క్రితం నార్త్ అమెరికాలో రాగా… అందుకు కారణాల అన్వేషణ గురించి నిపుణుల కమిటీ వేస్తే 2023 ప్రాంతంలో నివేదికలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల నార్త్ అమెరికాలో 2 వేల వృక్షాలు నేలకూలిన విషయంపై సమగ్రంగా అధ్యయనం చేశారు నిపుణులు. తాడ్వాయి అటవీ ప్రాంతంలో తాజాగా ఎదురైన పరిస్థితి వల్ల సుమారు 50 వేల చెట్లు నేల వాలిపోయాయి. కొన్ని చెట్లు అయితే గాలుల ప్రభావం వల్ల వంకలు తిరిగాయంటే ఇక్కడ ఎంతటి బీభత్సం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 6 మీటర్ల విస్తీర్ణంలో ఎదిగిన వృక్షాలు సైతం రెండుగా చీలిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. భయానకంగా వాతావరణం సృష్టించిన ఈ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిపుణుల బృందాలను రప్పిస్తున్నారు.