ఇక నుండి రిపోర్టర్లు ఆ పని చేయాల్సిందే…
దశాబ్దన్నర కాలం క్రితం తెలుగు రాష్ట్రాలలో ఓ ప్రభంజనం సృష్టించిన దిన పత్రిక అది. తెలుగు నాట సరికొత్త హంగులతో ప్రజల ముంగిట వాలిన ఆ దిన పత్రిక ఏక కాలంలో 23 ఏడిషన్లతో ప్రారంభం అయింది. నూతన ఒరవడిని సృష్టించేందుకు అన్ని పేజీలు రంగులతో పాఠకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందా పత్రిక. ఎన్నో సంచలనాలతో ప్రజలకు చేరువైన ఈ పత్రికలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అంతే సంచలనంగా మారాయి. తాజాగా ఈ పత్రిక యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నినాదాలతోనూ…
తెలగు పాఠకులను ఆకట్టుకునేందుకు సాక్షి చేసిన ప్రచారం కూడా సంచలనమేనని చెప్పాలి. ప్రధానంగా పాఠకులను కట్టిపడేసిన స్లోగన్లలో ‘‘ఉన్నది ఉన్నట్టు… ఉండదు కనికట్టు’’ అంటూ చేసిన ప్రచారం అంతా ఇంతకాదు. అయితే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అన్న రీతిలో ముందుకు సాగుతున్న సాక్షి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలో పనిచేస్తున్న రిపోర్టర్లకు సరికొత్త పనిని పురమాయించినట్టయింది. దీంతో ఇప్పుడు సాక్షిలో పనిచేస్తున్న రిపోర్టర్లు రోజూ ఆ పని చేస్తేనే సరి లేదంటే మీరు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నట్టుగా నమ్మాల్సి వస్తుందని సంస్థలో పని చేస్తున్న బాధ్యులు చెప్పేశారట. దీంతో మంగళవారం నుండి ఈ పని చేసే పనిలో నిమగ్నం అయ్యారు తెలంగాణాలోని సాక్షి పాత్రికేయులు.
ఏంటా బాధ్యతలు..?
రోజూ సాక్షిలో పనిచేసే రిపోర్టర్లు ఖచ్చితంగా రోజుకు రెండు సార్లు ఫోటోలు దిగి పంపించాలన్న నిభందన విదించారట. ప్రతి మండల రిపోర్టర్ ఉదయం ఓ సారి, సాయంత్రం ఓ సారి విధిగా పోలీస్ స్టేషన్ కు వెల్లి స్టేషన్ లో అందుబాటులో ఉన్న పోలీసులతో సెల్ఫీ దిగి గ్రూపులో వేయాలన్న నిభందన విదించారని తెలుస్తోంది. వీరు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ఈ సెల్ఫీ ఫోటోల ప్రక్రియకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. రిపోర్టర్లు పోలీస్ స్టేషన్ కు వెల్లినప్పుడు స్టేషన్ రైటర్ ఉన్నా, హోం గార్డు ఉన్నా సరే వారితో సెల్ఫీ దిగి రోజుకు రెండు సార్లో గ్రూపులో షేర్ చేయాల్సిందే. లేనట్టయితే ఆ రిపోర్టరు ఆ రోజు పనిచేసినట్టు కాదని భావిస్తామన్న సంకేతాలు కూడా ఇచ్చేశారట పెద్ద సార్లు.
కారణం ఏంటంటే..?
ఇటీవల కాలంలో సాక్షి దినపత్రికలో కవర్ అవుతున్న క్రైం వార్తలు సరిగా రావడం లేదని, వాటిలో లోతైన అధ్యయనం ఉండడం లేదని, దీంతో పత్రిక వెనకబడి పోతోందన్న విషయాన్ని గమనించి ఈ నిర్ణయిం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రిపోర్టర్లు క్రైం న్యూస్ కవరేజీకి నిత్యం స్టేషన్ కు వెల్తే మరిన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి కానీ ఫోన్లలోనే సమాచారం తెలుసుకుని వార్తలు చక్కబెట్టేస్తున్నారని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పది రోజుల పాటు రోజుకు రెండు సార్లు సెల్ఫీలు దిగి ఫోటోలు పంపించాల్సిందేనని చెప్పడంతో ఇప్పుడు సాక్షి రిపోర్టర్లు వార్త సేకరణకన్న ఎక్కువగా పోలీస్ స్టేషన్లలో ఉన్న వారితో సెల్ఫీలు దిగేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు. సెల్ఫీ చూస్తే చాలు తాము పనిచేస్తున్నామన్న నమ్మకం తమ పై సార్లకు కలుగుతుందని గమనించిన రిపోర్టర్లు ఇప్పుడదే పనికి ఎక్కువగా ప్రయరిటీ ఇవ్వనున్నారు.
అలా జరిగితే…
క్రైం వార్తల సేకరణలో లోతైన అధ్యయనం చేసి రిపోర్టర్లు సమగ్రమైన వార్తలు ఇచ్చేందుకు ప్రయారిటీ ఇస్తున్న క్రమంలో ఇతర పత్రికల్లో ఇతర విభాగాలకు సంబంధించిన వార్తలు స్కోర్ చేసినట్టయితే అప్పుడేం చేస్తారోనన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలా రిపోర్టర్లు అన్ని విభాగాలకు సంబంధించిన వార్తలు మిస్ కాకుండా ఉండేందుకు ఆయా శాఖల్లో పనిచేస్తున్న యంత్రాంగంతో సెల్ఫీలు దిగాలని కూడా చెప్తారేమోనన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు. ఇటీవల లైన్ అకౌంట్ కూడా కొంతమేర పెంచినట్టుగా సాక్షి వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెంచిన లైన్ అకౌంట్ డబ్బులు సెల్ఫీ పోటోలు దిగేందుకు తిరిగే పెట్రోల్ కు అయినా చాలవు కానీ నిభందనలు మాత్రం కఠినంగా పెట్టడమేంటీ అని అంటున్నారు మరికొందరు. ఏపీలో అధికారంలో ఉన్న జగనన్న సర్కారు ఉద్యోగులు విధుల్లో చేరే విషయంలో సమయ పాలన పాటించడం కోసం కొత్త కొత్త విధానాలు అమలు చేస్తున్నట్టుగానే సాక్షి పత్రికలో పని చేస్తున్న రిపోర్టర్ల అటెండెన్స్ విషయంలోను వైవిద్యంగా ఆలోచించడం ఆ పత్రికలోని పెద్దలకే చెల్లిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగా స్టేషన్లకు తరుచూ కండిషన్ బెయిల్ పై ఉన్నవారు, నేర చరిత రికార్డుల్లో పేరున్న వారు హాజరు వేసుకోవల్సిన తీరుగానే సాక్షిలో పని చేస్తున్న రిపోర్టర్లు రోజుకు రెండు సార్లు ఠాణాలకు వెల్లాల్సిన దుస్థితి తయారైందన్న ఆవేదన ఆ సంస్థలో పనిచేస్తున్న పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్న వారిలో వ్యక్తమవుతోంది. అయితే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లు పోలీసుల ముందు హాజరయితే చాలు కానీ సాక్షి రిపోర్టర్లు మాత్రం పోలీసులతో సెల్ఫీ దిగి తమ ఆఫీసులో అటెండెన్స్ వేసుకోవల్సిన పరిస్థితి తయారు కావడమే విడ్డూరమే మరి.!