వికారాబాద్ జిల్లాలో వింత శకలం ఒకటి వచ్చి పడింది. పంట పొలాల్లో పడిపోయిన వింత శకలం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ శకలం ఎక్కడి నుండి వచ్చి పడిందో అర్థం కాక స్థానికులు ఆరా తీసే పనిలో పడ్డారు. టైం మిషన్ ను పోలినట్టుగా ఉన్న ఈ శకలం ఏమై ఉంటుందోనన్న డిస్కషన్ పెద్ద ఎత్తున సాగుతోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన ఈ వింత శకలం హీరో బాలకృష్ణ, హీరోయిన్ గా మోహినిలు నటించిన ఆదిత్య 369 సినిమాలోని టైం మిషన్ ను పోలినట్టుగా ఉంది. వెరైటీగా ఉన్న ఈ శకలం ఏమై ఉంటుందబ్బా అని ఆరా స్థానికులు తీస్తున్నారు. ముందుగా చూసిన స్థానికులు ఈ మిషన్ వీడియోను నెట్టింట వైరల్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుండ్రంగా ఉన్నఈ భారీ శకలం ఎక్కడి నుండి వచ్చి పడిందోనన్న విషయంపై స్థానికంగా తర్జనభర్జనలు పడుతున్నారు.
అదేనా…?
అయితే హైదరాబాద్ లోని ఇస్రో శాస్త్ర వేత్తలు చేస్తున్న పరిశోధనలకు సంబందించిన శకలం అయి ఉంటుందని భావిస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా చేసిన ప్రయోగాలకు సంబందించి ఆకాశంలోకి పంపించిన క్రమంలో ఈ శకలం ఒకటి జారి పడిందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఘటనా స్థలానికి పోలీసులు, అధికారుల బృందం చేరుకుంది. పరిశోధనలకు సంబంధించిన శకలమేనని అధికార వర్గాలు అంటున్నాయి.