అవిశ్వాస నోటీసులు… ఫిర్యాదులు… కరీంనగర్ బల్దియా ప్రతినిధుల తీరు…

దిశ దశ, కరీంనగర్:

పార్టీ ఫిరాయింపుల పర్వంతో కరీంనగర్ లో విచిత్ర రాజకీయాలు మొదలయ్యాయి. మరో 24 గంటల్లో పాలకవర్గ పదవి కాలం ముగిసిపోనున్న నేపథ్యంలో కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా తాజాగా ఫిర్యాదుల పరంపర కూడా మొదలు పెట్టారు. దీంతో కరీంనగర్ పాలిటిక్స్ కొత్త పుంతలు తొక్కడం మొదలు పెడుతోంది.

మేయర్ సునీల్ రావుపై…

ఇప్పటికే ఏసీబీకి మేయర్ సునీల్ రావుపై ఫిర్యాదు చేయగా తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పోరేటర్లంతా కలిసి ఆయనపై అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పలువరు కార్పోరేటర్లు అవిశ్వాసం ప్రకటిస్తు దరఖాస్తు చేశారు. అంతేకాకుండా కరీంనగర్ బల్దియా పరిధిలో గత 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరిపించాలని కూడా కలెక్టర్ కు మరో వినతి పత్రం సమర్పించారు కార్పోరేటర్లు.

కార్పోరేటర్లు, నాయకులపై…

ఇకపోతే తాను బీజేపీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్పోరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 56వ డివిజన్ కార్పోరేటర్ వి రాజేందర్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, 43వ డివిజన్ కు చెందిన పార్టీ నాయకులు నవాజ్ హుస్సేన్ తో పాటు మరికొంతమంది ఫేస్ బుక్ తో పాటు ఇతర ప్రచార మాధ్యమాల్లో మార్పింగ్ చేసి అసభ్యకరంగా వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అసభ్యకరమైన కామెంట్లు కూడా చేస్తు తన పరువుకు భంగం కల్గిస్తున్నారని, తనను అవమాన పరిచే విధంగా ట్రోల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

హతవిధి…

నిన్న మొన్నటి వరకు తామంతా ఒకటేనని ఢంకా బజాయించిన నేతలు పార్టీ ఫిరాయింపుతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం గమనార్హం. అవినీతి అక్రమాల గురించి ఇంతకాలం పల్లెత్తు మాట ఎత్తని ఈ నాయకులు ఇప్పుడు మాత్రం అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. కార్పోరేటర్ బండారి వేణు గతంలోనే ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుతో బల్దియా ద్వారా వెచ్చించిన నిధులప ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా సునీల్ రావు పార్టీ ఫిరాయించడంతో ఆయనపై విచారణ జరపాలని మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారు. సునీల్ రావు కూడా తన పరువుకు భంగం కల్గించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయడం మరో విశేషం. అంతేకాకుండా సునీల్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ అవినీతిపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. తానే రెండు రోజుల్లో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని కూడా వెల్లడించారు. ఇన్ని రోజులు గులాభి జెండా నీడన ఉన్నంత కాలం అంతా బావుందన్న రీతిలో వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మేయర్ సునీల్ రావు తాజాగా వ్యవహారిస్తున్న తీరుపై నగరంలో హాట్ టాపిక్ అవుతోంది. అవినీతి అక్రమాల గురించి ఇంతకాలం నోరు మెదపని వీరంతా ఇప్పుడు మాత్రం ప్రజల ముందు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్న తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు కరీంనగర జనం.

You cannot copy content of this page