ఓ ఇంట్లో వింత శబ్దాలు
పూర్వీకులను పోలిన వారసులు పుడ్తారని నమ్ముతాం.. పుట్టిన బిడ్డకు తాతల పేర్లు పెట్టేందుకు మొగ్గు చూపే వారినీ చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం ఏకంగా పూర్వీకులు మళ్లీ జన్మిస్తారన్న నమ్మకంతో వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. మహానగరం హైదరబాద్ పాతబస్తీలోని ఓ ఇంట్లో వింత శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ ఇంట్లో అసలేం జరుగుతుందో అంతుచిక్కక అయోమయానికి గురయ్యారు. ఆ కుటుంబం చెప్పిన మాటలు నమ్మి కొంతమంది ఏకంగా ప్రార్థనలు చేశారు. చివరకు దిక్కు తోచక పోలీసులకు సమాచారం ఇచ్చారు కొందరు. కాఖీలు ఎంట్రీతో అసలు కథ ఏంటో వెలుగులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే…?
హైదరాబాద్ పాతబస్తీలో ఒక్కసారిగా కలకలం సృష్టించిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓ బాబా కలలోకి వచ్చి చెప్పిన మాటలు నమ్మి ఏకంగా ఇంట్లోనే సమాధి నిర్మించారు. పహాడీ షరీఫ్ లో జరిగిన ఈ ఘటనకు సదరు కుటుంబీకులు చెప్పిన విషయాలు విని పోలీసులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ కుటుంబంలోని వృద్ధురాలి కలలోకి వచ్చిన బాబా తమ వంశం 600 ఏళ్లుగా ఈ భూమిలో నిద్రిస్తోందని, పూర్వీకులమైన తాము తిరిగి భూమిపైకి రావాలనుకుంటున్నామని చెప్పాడని ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. 600 ఏళ్ల క్రితం భూమిలో కలిసిపోయిన తాము తిరిగి భూమి పైకి రావాలంటే ఇంట్లోనే సమాధి నిర్మించినట్టయితే తమ ఆకాంక్ష నెరవేరుతుందని బాబా కలలో చెప్పాడని వృద్ధురాలు వివరించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వృద్దురాలు చెప్పిన విషయం నిజమేనని నమ్మిన కుటుంబ సభ్యులు బాబా వంశం కోసం సమాధి నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఇంట్లో గోయి తవ్వి సమాధి కట్టి అలంకరించారు. ఆ నోట ఈ నోట విన్న సమీప కుటుంబాలకు చెందిన వారు కూడా ఇది నిజమని నమ్మి ఆ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. కొద్ది రోజులుగా వింత శబ్దాలు రావడం, ఇంట్లోనే సమాధి కట్టడం, ప్రార్థనలు చేయడం గమనించిన స్థానికులు కొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ సమాధిని కూల్చి, వృద్దురాలితో ప్రత్యేకంగా మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకున్నారు. ఆ తరువాత సదరు ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఎప్పుడో చనిపోయిన వారు తిరిగి భూమిపైకి రావడం ఏంటని ప్రశ్నించారు. కలలో వచ్చిన విషయాలన్ని కూడా నిజాలు కాదని, అసాధ్యమైన విషయాలపై అతి నమ్మకం పెట్టుకోవడం మంచిది కాదంటూ హితవు పలికారు. పోలీసుల ఎంట్రీతో సమాధి కథ భూ స్థాపితం అయిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.