కౌశిక్ రెడ్డి ప్లాన్స్ క్ చెక్ పెట్టిందెవరో..?
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ లో పరిస్థితుల్లో ఒక్క సారిగా మార్పు వచ్చేసిందా..? లబ్దిదారులకు చెక్కుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఝలక్ ఇచ్చారా..? ఎమ్మెల్యే కాకున్న నిన్న మొన్నటి వరకు ఏక చత్రాధిపత్యం చెలాయించినా సర్కారు మారే సరికి చప్పబడిపోవల్సి వచ్చిందా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితులు.
అప్పుడు అలా…
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యేగా, మండలి విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి అన్ని తానై వ్యవహరించారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం లేకుండా జరగలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కౌశిక్ రెడ్డికే ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకేతాలు ఇవ్వడంతో ఇక్కడి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయన చెప్పినట్టే నడుచుకున్న పరిస్థితి. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే పాడి కౌశిక్ రెడ్డి సమీకరణాలను నెరిపారు. సర్కారుతో కావల్సిన ఎలాంటి పని అయినా కూడా ఆయన ప్రమేయం లేకుండా అడుగు ముందుకేయని పరిస్థితి తయారైంది. దీంతో హుజురాబాద్ ప్రజలంతా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై విశ్వాసం పెంచుకుని ఆయన వైపు అడుగులేశారు.
ఇప్పుడిలా…
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ హుజురాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన అప్పటిలాగానే నడుచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. సోమవారం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నానరు. 19 గ్రామాల్లోని లబ్ది దారుల ఇండ్ల వద్దకు వెల్లి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే అనూహ్యంగా సోమవారం నాటి ఈ టూర్ ప్రోగ్రామ్ కౌశిక్ రెడ్డి రద్దు చేసుకోవల్సి వచ్చింది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల నుండి సూచనలు వస్తే తప్ప తాము ముందడుడు వేసే పరిస్థితి లేదని అఫిషియల్స్ ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల ఆదేశాల మేరకే నడుచుకుంటామని చెప్పకనే చెప్పడంతో కౌశిక్ రెడ్డి తన షెడ్యూల్ ను రద్దు చేసుకోవల్సి వచ్చినట్టుగా సమాచారం. మరో వైపున అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న సంకేతాలు పంపినట్టుగా తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ లో నెలకొన్న పరిస్థితుల్లో ఒక్క సారిగా మార్పు వచ్చినట్టయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంతా తానై నడిపిస్తే ఇప్పుడు ఆయన ప్రయత్నాలకు బ్రేకులు పడుతున్నాయని స్థానికులు అంటున్నారు.