ఇసుక రవాణాపై సర్కారు కఠినం…
సామాన్యునికి కష్టకాలం…
దిశ దశ, హైదరాబాద్:
నిర్దేశించుకున్న లక్ష్యం కోసం సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలం అవుతాయో లేదో తెలియదు కానీ… దీని ప్రభావం మాత్రం మహానగర సామన్య జనంపై తీవ్రంగానే పడుతోంది. 2019లో రాష్ట్రంలోని ఇసుక రీచుల ద్వారా రూ. 900 కోట్ల ఆదాయం రాగా ఈ సారి ఆదాయం రూ. 700 కోట్ల వరకే వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. రూ. 1100 కోట్ల వరకూ ఆదాయం పెంచాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఇసుక రీచుల వద్ద అధికారులు షిప్టుల వారిగా డ్యూటీలు వేయడంతో పాటు ప్రధాన రహదారులపై మొబైల్ అధికారుల బృందాలు, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూడా ఇసుక లారీలను తనిఖీలు చేపట్టడం మొదలు పెట్టింది. ఓవర్ లోడ్ తో పాటు జీరో దందాకు బ్రేకులు వేసే పనిలో అధికార యంత్రాంగం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. దీని ప్రభావం హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టిన సామాన్యులకు ఇబ్బందిగా మారిపోయింది. నిబంధనలు అలము చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో మహానగరంలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకు ముందు ఓ రకానికి టన్నుకు రూ. 1100 ధర పలకగా ప్రస్తుతం రూ. 1650కి పెరిగింది. అలాగే సన్న ఇసుక ధర కూడా దాదాపు 400 రూపాయల వరకు పెంచేశారు. దీంతో ఇసుక కొనుగోలు చేస్తున్న వారిపై రూ. 16000 వేలకు అదనపు భారం పడుతోంది. దీంతో వినియోగదారులు ఇసుక కొనుగోలు చేస్తే ఎక్కు ఖర్చు వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ రోబో సాండ్ కొనేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం.
నామమాత్రానికి కూడా…
అయితే లారీల్లో తరలిపోతున్న ఇసుక ఓవర్ లోడ్ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లారీలో క్వింటాలు ఇసుక ఉన్నా కూడా జరిమానా విధిస్తున్న తీరు లారీ యజమనాలును ఆందోళన కల్గిస్తోంది. అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ పెనాల్టి విధించే విషయంలో వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా ఉందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. టన్నుల్లో ఇసుక అదనంగా తరలిపోతే చర్యలు తీసుకుంటే బావుంటుంది కానీ నామమాత్రంగా ఎక్కువ ఇసుక ఎక్కువగా ఉన్నా జరిమానా విధిస్తున్నారని అంటున్నారు.
అక్కడ మరి..?
అయితే ఓవర్ లోడ్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవరిస్తున్న అధికారులు అందుకు తగినట్టుగా సౌకర్యాలను కల్పించడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి రీచు వద్ద ప్రత్యేకంగా వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కానీ ఇంతకాలం చూసిచూడనట్టుగా TGMDC వ్యవహరించడంతో చాలా రీచుల్లో కూడా ఇసుక లోడింగ్ విధానం అంచనాలతోనే సాగిందని చెప్పవచ్చు. లోడింగ్ కు ఉపయోగిస్తున్న బకెట్ కెపాసిటీని బట్టి లారీలో ఎన్ని టన్నుల ఇసుక లోడ్ అవుతుందోనన్న విషయాన్ని అంచనా వేసే విధానం అమలయ్యేది. ఇప్పుడు కూడా చాలా రీచుల్లో ఇదే పద్దతిన ఇసుక లోడింగ్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో తూకంలో హెచ్చు తగ్గులు ఉండడం సహజంగానే వస్తుంటుంది. కానీ క్వింటాలు లోపున ఉన్న ఎక్కువ ఇసుక ఉన్నా కూడా జరిమానాలు విధిస్తుండడం లారీ యజమానుల జేబులు గుల్ల అయ్యే ప్రమాదం ఎదురవుతోందని అంటున్నారు. అయితే అధికారులు ఓవర్ లోడ్ విషయంలో నిబంధనలు అమలు చేసే ముందే TGMDC ద్వారా వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్టయితే ఎక్కువ ఇసుక స్టాకు యార్డుల నుండే రవాణా అయ్యే అవకాశం ఉండదు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ధర్మ కాంటాల కోసం నిధులు కెటాయించి వాటిని నిర్మించిన తరువాత ఓవర్ లోడ్ విధానంపై దృష్టి సారిస్తే బావుంటుందని అంటున్నారు.