వెంటాడుతున్న అసమ్మతి…

మళ్లీ మీటింగ్ వాయిదా…

దిశ దశ, హుజురాబాద్:

హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీని అసమ్మతి వెంటాడుతూనే ఉంది. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తాము మునిసిపల్ సమావేశానికి వచ్చేదే లేదని కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో మరో సారి హుజురాబాద్ మునిసిపాలిటీ జనరల్ బాడీ సమావేశం కోరం లేక వాయిదా పడింది. తాజాగా సోమవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి మెజార్టీ కౌన్సిలర్లు ఎవరూ కూడా హాజరు కాకపోవడం గమనార్హం. దీంతో సమావేశం కోరం లేక వాయిదా వేస్తున్నట్టు మునిసిపల్ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా 21 మంది కౌన్సిలర్లు మీడయాతో మాట్లాడుతూ… ఫిబ్రవరి 2న మెజార్టీ కౌన్సిలర్లం ఛైర్ పర్సన్ గందె రాధికపై అవిశ్వాసం ప్రకటిస్తూ జిల్లా అధికారులకు నోటీసు ఇచ్చామన్నారు. ఛైర్ పర్సన్ తొలగించేంతవరకు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసే ఎలాంటి సమావేశాలకు హాజరు అయ్యేది లేదని గతంలోనే తాము తేల్చి చెప్పామన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పెద్దలకు కూడా చెప్పామన్నారు. ఛైర్ పర్సన్ గందె రాధిక ఒంటెత్తు పోకడలు, ఏక చత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. కౌన్సిలర్లకు విలువ ఇవ్వకుండా సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బతింటున్నదన్నారు. మెజార్టీ కౌన్సిలర్లందరం ఛైర్ పర్సన్ అవినీతి అక్రమాలను ఎండగొడుతూ గతంలో కూడా సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ అవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని పదవి నుండి గౌరవంగా తప్పుకోకుండా ఛైర్ పర్సన్ పదవిలోనే కొనసాగుతున్నారన్నారు. అయితే కౌన్సిలర్లంతా ఏకమై అవిశ్వాసం నోటీసు కారణాన్ని చూపుతూ సమావేశానికి రాకుండా ఉన్నట్టయితే ఈ సారి బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page