దిశ దశ, దండకారణ్యం:
బస్తర్ దండకారణ్య అటవీ ప్రాంతం విద్యార్థుల నిరసనలతో హోరెత్తిపోతోంది. న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్ తో విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న పోరాటానికి కారణమిదే. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా మూడవెండి గ్రామంలో ఇటీవల భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై అటు మావోయిస్టులు, ఇటు ప్రజా స్వామిక వాదులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల తీరును తప్పు పడుతూ చేపట్టిన ఆందళోనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరు నెలల చిన్నారి మృతిపై న్యాయ విచారణ చేపట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన చేపట్టిన చిన్నారులు భద్రతా బలగాల తీరుపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. అయితే పూర్వ బస్తర్ జిల్లా పరిధిలోని ఈ ప్రాంతమంతా కూడా మావోయిస్టు పార్టీ నక్సల్స్ పట్టు బిగించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని తమ కంచుకోటగా మార్చుకున్న మావోయిస్టులు క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నక్సల్స్ భూంకాల్ పోరాట స్పూర్తితో దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఆదివాసీలతో మమేకమైన మావోయిస్టులను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఆరు నెలల చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలన్న డిమాండ్ ను ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులు తెరపైకి తీసుకొచ్చారు. అయితే తాజాగా విద్యార్థులు కూడా ఈ ఘటనపై ప్రదర్శనలు చేపట్టడం గమనార్హం.|