ఎంకి పెళ్లి సుబ్బి చావుకొస్తోందా..? ఉచిత బస్సుతో విద్యార్థుల కష్టాలు…

దిశ దశ, జగిత్యాల:

ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటున్న తీరుతో తమ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్న విషయాన్ని తల్లులు గమనించలేకపోతున్నారా..? ఫ్రీ సర్వీస్ ఫెసిలిటీ మనం అందుకుంటే చాలనుకుంటే చదువుకునే చిన్నారుల పరిస్థితి ఎలా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన అవసరం  అంతకన్నా ఎక్కువగా ఉంది. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనతో అయినా అటు మహిళా ప్రయాణీకులు, ఇటు ఆర్టీసీ అదికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రం నుండి పెగడపల్లికి వెల్లే లాస్ట్ బస్సు ప్రయాణీకులతో కిటకిటలాడిపోయింది. అసలే చివరి బస్సు కావడంతో అన్ని వర్గాల ప్రయాణీకులకు ఇదే దిక్కయింది. ఇదే సమయంలో విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రయాణీకులతో లాస్ట్ బస్ కాస్తా కిటకిటలాడిపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాయ్స్ ఇంటికి చేరుకోవాలన్న తపనతో బస్సు వెనక వేలాడుకుంటూ వెళ్లారు. అయితే అటు ఫుట్ బోర్డు, ఇటు బస్సు వెనక కూడా వేలాడుకుంటూ తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఆతృతగా వెల్లిపోయారు. అసలే చివరి బస్సు కావడం… ఇంటికి చేరే పరిస్థితి లేకపోవడంతో కాలేజీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఫ్రీ బస్సు అయితే మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడ్తారా..? అసలే లాస్ట్ బస్సు కదా మేమెలా ఇళ్లకు చేరుకోవాలంటూ స్టూడెంట్స్ కొంతమంది ఏడ్చారు. ఆర్టీసీ డ్రైవర్ బస్సును కొద్దిసేపు ఆపినప్పటికీ బస్సులో ఏ మాత్రం చోటులేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

మార్పు అవసరం…

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు నూతనంగా అమలు చేసిన మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ వల్ల కొన్ని సమయాల్లో అయితే ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులు విద్యాసంస్థలకు వెల్లేప్పుడు, ఇంటికి చేరేప్పుడు వారి కోసం బస్సుల్లో ఎక్కకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు, ఇతర పనుల కోసం పట్టణాలకు వెళ్లే వారు, వచ్చే వారు కూడా స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్న బస్సుల్లో ప్రయాణిస్తుండడంతో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే స్టూడెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆ సమయాల్లో ఫ్రీ బస్సు సర్వీస్ ఉండదన్న నిబంధనను అయినా సవరిస్తే బావుంటుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే బస్సుల్లో అనుమతించే విధానం అమలు చేసినట్టయితే అన్నింటా బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేనట్టయితే పీక్ హవర్స్ ను దృష్టిలో పెట్టుకుని రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడిపించినా బావుంటుందన్ని అంటున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి వెల్లే సాధారణ ప్రయాణీకులు కూడా విద్యార్థుల ఇబ్బందులను గమనించి స్కూల్ హవర్స్ లో బస్సుల వైపు కన్నెత్తి చూడకుండా ఉన్నా వారు విద్యా సంస్థలకు చేరుకుని ప్రశాంతంగా తమ ఇండ్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.

You cannot copy content of this page