దిశ దశ, వరంగల్:
ల్యాండ్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆమె అత్యంత వైవిద్యమైన జీవనం సాగిస్తుంటారు. నిరుపేదలను అక్కున చేర్చుకునేందుకు ఆమె సెలవు దినాల్లో కూలీ పనికి వెల్లి తనవంతు ఆర్థిక సాయం అందిస్తారు. కూలీ రూపంలో వచ్చే డబ్బులను పేదలకు పంచిపెట్టి తనలోని సేవాభావాన్ని చాటుకుంటారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంత మహిళలను చైతన్యవంతులను చేసేందుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటుంటారు. డబ్బులు తీసుకుని ఓటు వేయడం మంచిది కాదని నిజాయితీతో ఓటు వేసి సరైన వారిని ఎన్నుకోవాలని కూడా గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన కల్పిస్తుంటారు. ట్రాక్టర్, బైక్ వాహనాలు నడపడంలో కూడా ఆమె తన ప్రత్యేకతను ప్రదర్శిస్తుంటారు. ఎన్నో రకాలుగా తనలోని సేవా భావం ప్రదర్శించిన ఆ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది. తెలంగాణాలోనే ఆ సబ్ రిజిస్టార్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే విధంగా సేవలందించిన ఆమె శుక్రవారం అవినీతికి పాల్పడుతూ పట్టుబడడం గమనార్హం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ల్యాండ్ సబ్ రిజిస్టారర్ కార్యాలయంలో పనిచేస్తున్న ‘’తస్లీమ’‘ రూ. 19, 200లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన ఏసీబీ అధికారులు బాధితులు, ప్రత్యక్ష్య సాక్షుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. మరో వైపున రిజిస్టార్ కార్యాలయానికి సంబంధించిన ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ల వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేయగా వారి వద్ద రూ. 1.78 లక్షలు కూడా దొరికాయి. వరంగల్ జిల్లా ఏసీబీ అధికారులు ఈ దాడులో చేశారు. ఓటు వినియోగించుకునే విషయంలోనే అవినీతికి పాల్పడవద్దని సూచించిన అధికారే అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కడం సరికొత్త చర్చకు దారి తీసింది.