మేడిగడ్డ రైతుల సక్సెస్…

పట్టు వదలని విక్రమార్కుల్లలా పోరాటం

పరిహారం చెల్లించిన ‘మహా’ సర్కార్

దిశ దశ, దండకారణ్యం:

సామాన్య రైతులు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఏడాదిన్నర పాటు చేపట్టిన పోరాటంలో తొలి విడుత సక్సెస్ అయ్యారు. ఉపాధి కోసం ఎక్కడిక్కడికో వెల్లిన యువత స్వగ్రామాలకు చేరుకుని చేయి చేయి కలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరవధిక నిరసనలు చేపట్టింది. నక్సల్స్ వారోత్సవాల కారణాలు, పోలీసు యాక్టు అమలు వంటి చర్యలకు పాల్పడ్డా వారు మాత్రం వెనకంజ వేయకుండా చివరకు సక్సెస్ మంత్ర సాధించారు.

మేడిగడ్డ బాధితులు…

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వల్ల బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న 12 గ్రామాల రైతులు గత ఐదేళ్లుగా సాగు చేసుకోలేకపోయారు. మొదటి విడుతగా చేపట్టిన సర్వేలో మరో 128 హెక్టార్ల భూమికి సంబంధించిన పరిహారం డబ్బులు తెలంగాణ ప్రభుత్వం చెల్లించలేదు. రూ. 11 కోట్లు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం మిగతా పరిహారం ఊసెత్తడం లేదని బాధిత గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయండంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు వినతి చేసిన రైతులకు బాసటగా ఎవరూ నిలబడలేదు. చివరకు చేసేదేమి లేక రైతులు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసు యాక్టు అమల్లో ఉందని నలుగరికంటే ఎక్కువ జనం గుమిగూడవద్దని హెచ్చరికలు జారీ చేయడంతో బాధితు రైతులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి రోజుకు నలుగురు చొప్పున నిరసన దీక్షా శిభిరంలో కూర్చున్నారు. ఇదే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాగపూర్ లో నిర్వహిస్తున్నారు. దీంతో బాధిత గ్రామాలకు చెందిన యువత నేరుగా నాగపూర్ కు వెల్లి నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఓ జర్నలిస్టు సాయంతో పాటు ఎమ్మెల్యే ధర్మరావు బాబా ఆత్రం ద్వారా డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ను కలిశారు. అసెంబ్లీలో ఫడ్నవిస్ ను కలిసిన సిరొంచ రైతులు గత ఐదేళ్లుగా తాము పడుతున్న కష్టాలను ఎకరవు పెట్టి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించి పరిహారం ఇప్పించి తీరుతామని, నిరసనలు ఆపివేయాలని సూచించారు. ఫడ్నవిస్ ప్రకటనతో సిరొంచ తాలుకా కేంద్రంలోని దీక్షా శిబిరాన్ని ఎత్తివేశారు. మరునాడు బాధిత గ్రామాల రైతులతో సమావేశం ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ ఇచ్చిన హామీ గురించి వివరించారు. ఆ తరువాత గడ్చిరోలి కలెక్టర్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో చర్చలు జరిపి వారికి ఇవ్వవలసిన పరిహారం గురించి, వారి అభిప్రాయాలు ఏంటోనని తెలుసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిక పంపిస్తామనని జిల్లా కలెక్టర్ బాధిత రైతాంగానికి చెప్పారు. అయితే మహారాష్ట్ర సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి మొదటి విడత రావల్సిన రూ. 27 కోట్ల నగదు పంపించాలని లేఖలు రాసినప్పటికీ స్పందించలేదు. దీంతో రైతులు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మూడు నాలుగు నెలలు ఎదురు చూసిన బాధిత గ్రామాల రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. శాంతియుతంగా నిరవధిక నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 45 రోజులుగా సిరొంచ తాలుకా కేంద్రంలో మళ్లీ నిరసన శిబిరం ఏర్పాటు చేసుకున్నారు బాధిత గ్రామాల రైతులు. ఈ క్రమంలో గడ్చిరోలి జిల్లా ఇంఛార్జి మంత్రిగా కూడా ఉన్న ఫడ్నవిస్ జిల్లా కేంద్రానికి పర్యటనకు వస్తున్నారని తెలిసి రైతుల బృందం ఒకటి గడ్చిరోలికి వెల్లింది. అక్కడ ఫడ్నవిస్ ను కలిసి తమ గోడు మరోసారి వెల్లబోసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుండి నిధులు అలాట్ అయ్యే వరకూ వేచి చూస్తే తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుందని ఆవేదనతో తెలిపారు. దీంతో డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. అయితే రైతులు మాత్రం నిరసన దీక్షా శిబిరాన్ని మాత్రం ఎత్తివేసేది లేదని కఠినంగా నిర్ణయించుకున్నారు. తమకు రావల్సిన పరిహారం చేతికి వస్తే తప్ప తాము నిరసనల నుండి తప్పుకోకూడదని రైతులు మూకుమ్మడిగా నిర్ణయించుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎట్టకేలకు…

ఎట్టకేలకు సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల రైతాంగం చేపట్టిన నిరవధిక నిరసనలకు బుధవారం పుల్ స్టాప్ పడింది. బాధిత రైతులకు సంబంధించిన 128 హెక్టార్లకు సంబంధించిన రూ. 38 కోట్లకు గాను రూ. 11 కోట్లు నిలువ ఉన్నాయని మిగతా 27 కోట్లు విడుదల చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారం కూడా గురువారం నుండి రైతుల అకౌంట్లలో నేరుగా పడుతాయని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శోభా థాయ్ బుధవారం దీక్షా శిబిరానికి చేరుకుని రైతులకు నిమ్మరసం ఇచ్చి నిరసనలు విరమింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు సందర్శన రోజునే మహారాష్ట్ర రైతులు పరిహారం అందుకోవడం విశేషం.

You cannot copy content of this page