చరిత్ర సృష్టించిన ఫాదర్స్… ఎదురీదుతున్న సన్స్

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. ఏ పార్టీలో అయినా బలం… బలగం చూపించుకునే సత్తా ఈ జిల్లా నేతలకే దక్కింది. భారత ప్రధానిని అందించిన ఘనకీర్తి ఉమ్మడి జిల్లాకే దక్కింది. జాతీయ కాంగ్రెస్ రాజకీయాలే అయినా, టీడీపీ పతనానికి కారణమే అయినా, బీజేపీలో క్రియాశీలక పాత్రే అయినా ఈ జిల్లా నాయకుల ప్రమేయం ఖచ్చితంగా ఉండాల్సిందే. స్వాతంత్రోద్యమ కాలం నుండి నేటి వరకు ఎన్నో వైవిద్యాలను తనలో దాచుకున్న ఈ జిల్లాలో మరో చరిత్ర కూడా క్రియేట్ అయింది. ఈ జిల్లా నుండి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేసుకున్న తండ్రులకో చరిత్ర ఉంటే… వారి వారసులు మాత్రం ఎదురీదుతున్న పరిస్థితే కనపడుతోంది.

కరీంనగర్ లో ఇలా…

కరీంనగర్ రాజకీయాల్లో ఓ బ్రాండ్ క్రియేట్ చేసిన వారిలో వెలిచాల జగపతి రావు ఒకరు. మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన తనకంటూ ఓ వైవిద్యమైన చరిత్రను క్రియేట్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కరీంనగర్ నుండి గెలిచిన రికార్డు కూడా ఆయన సొంతమనే చెప్పాలి. అయితే ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు వెలిచాల రాజేందర్ రావు మాత్రం ప్రాక్టికల్ గా సక్సెస్ కాలేకపోతున్నారు. ఓ సారి కరీంనగర్ లోక సభ స్థానం కోసం ఉద్యమ పార్టీ నుండి టికెట్ ఆశించిన రాజేందర్ రావు చివరి క్షణంలో భంగపడక తప్పలేదు. చొప్పదండి జనరల్ స్థానంగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు 30 వేల పై చిలుకు ఓట్లు సాధించుకున్నప్పటికీ గెలుపును అందుకోలేకపోయారు. 2009లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజేందర్ రావు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే పీఆర్పీ అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు సాధించుకున్న రికార్డు అందుకున్నారు వెలిచాల. ఆ తరువాత పలుమార్లు ఆయన పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయనకు అవకాశాలు కలిసి రాలేదు. కొంతకాలంగా ప్రత్యక్ష్య రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ తన భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సమాయత్తం అయ్యారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినట్టయితే బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నానన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రాజేందర్ రావును ఆ పార్టీ నాయకత్వం ఆదరిస్తుందా లేదా అన్న చర్చ ఇంటా బయట సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే బలమైన అభ్యర్థుల పేర్లు తెరపైకి రావడం లేదు. ప్రతిపాదనకు వచ్చిన వారి పేర్లలో రాజేందర్ రావుకే గుర్తింపు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయెనన్నదే పజిల్ గా మారింది.

మూడో ‘సారీ’

ఇకపోతే కరీంనగర్ నుండి ఒకే సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీనరసింహరావు భవితవ్యం కూడా అలాగే ఉంది. తన తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ఆయనకు దురదృష్టం వెంటాడుతున్నట్టుగానే ఉంది. మొదటి సారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం గెలవలేకపోయారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ చల్మెడను విజయం వరించకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. 2014 ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన స్వరాష్ట్ర కల సాకారం ప్రభావంతో ఓటమి చవి చూడక తప్పలేదు. తాజా ఎన్నికల్లో వేములవాడ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయారు. అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత లభించింది. లక్ష్మీనరసింహరావు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినట్టయితే పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా లేకపోవడంతో ఆయన ఖచ్చితంగా కరీంనగర్ టికెట్ దక్కేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంతే కాకుండా ఈ సారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కూడా అందిపుచ్చుకునే వారని అన్నవారూ లేకపోలేదు. తండ్రి ఆనందరావు కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అలంకరిస్తే తనయుడు లక్ష్మీ నరసింహరావు మాత్రం చట్ట సభలోకి అడుగుపెట్టేందుకు అవాంతరాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదురవుతోంది.

జువ్వాడిది అదే పరిస్థితి..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుల్లో జువ్వాడి రత్నాకర్ రావు ఒకరు. బుగ్గారం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఓ సారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నర్సింగరావు ప్రజాక్షేత్రంలో విఫలం అవుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున కోరుట్ల నుండి పోటీ చేసిన నర్సింగరావు గెలుపును మాత్రం అందుకోలేకపోతున్నారు. తండ్రి రాజకీయాలను ఒంటబట్టుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నర్సింగరావును మాత్రం సొంత నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకోకపోవడం గమనార్హం.

పేరెంట్స్ అలా… 

ఇకపోతే కొమొరెడ్డి ఫ్యామిలీలో మరో వైవిధ్యత కొనసాగుతోంది. కొమొరెడ్డి దంపతులు రాములు, జ్యోతిలు ఎమ్మెల్యేలుగా గెలిచిన రికార్డు అందుకున్నారు. అయితే వారి వారసత్వంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న వారి తనయుడు కరంచంద్ మాత్రం టికెట్ రేసులో ఉంటున్నా ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో అధిష్టానం ముందుకు రావడం లేదు. దీంతో ఆయన రాజకీయాల్లో  తన తొలి అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు.

మంథనిలో…

సర్పంచ్ గా ముత్తారం ఎంపీపీగా పనిచేసిన చందుపట్ల రాంరెడ్డి పదవి కాలం ముగిసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 1994 ఎన్నికల సమయంలో తన భవిష్యత్తు పరిక్షించుకునేందుకు మంథని నుండి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా టీడీపీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది. అనూహ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలిచిన రాంరెడ్డి బలమైన అభ్యర్థి అయిన స్పీకర్ శ్రీపాదరావుపై గెలిచారు. అయితే ఆయన తనయుడు చంద్రుపట్ట సునీల్ రెడ్డి మాత్రం 2014 ఎన్నికలప్పటి నుండి ప్రజా క్షేత్రంలో సక్సెక్ కాలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 2018 ఎన్నికల్లో ఉద్యమ పార్టీ నుండి టికెట్ ఆశించి రెండో సారి భంగపడ్డారు. తాజా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన ఈ సారి కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులను మార్చగా ఈ సారి సునీల్ రెడ్డికి పెద్దపల్లి జిల్లా పగ్గాలు అప్పజెప్పారు. పార్టీ నిర్మాణ పరంగా అయిన సునీల్ రెడ్డి సక్సెస్ అవుతారా లేదా అన్న చర్చ మొదలైంది.

వికసించని వికాసం…

సొంత నియోజకవర్గం కాకుండా పొరుగు సెగ్మెంట్ అయిన మెట్ పల్లిలో నుండి పోటీ చేసి గెలిచారు చెన్నమనేని విద్యాసాగర్ రావు. కరీంనగర్ ఎంపీగా రెండు సార్లు గెలిచిన ఆయన కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతలు కూడా చేపట్టిన విద్యాసాగర్ రావు ప్రజా క్షేత్రంలో తనకుంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆయన తనయుడు వికాస్ రావు మాత్రం తొలిసారిగా చేసిన ప్రయత్నంలో విఫలం అయ్యారు. వేములవాడ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టలేదు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారు విషయంలో నెలకొన్న ఉత్కంఠత కారణంగా చివరి నిమిషంలో బీఫారం అందుకున్నారు. అయితే వికాసరావు అప్పటికే నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆయనకు మాత్రం వేములవాడ ప్రజలు మాత్రం అక్కున చేర్చుకోలేదు.

You cannot copy content of this page