సామాన్య రైతులు సాధించారు…

పరిహారం అందుకోవడంతో సక్సెస్…

మేడిగడ్డ బాధితుల తొలి విజయం

దిశ దశ, దండకారణ్యం:

చేయి చేయి కలిపిన సామాన్య రైతులు కదం తొక్కారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలిగెత్తి చాటారు. రోడ్డున పడ్డ తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయా గొంతుకలు. ఏకంగా ఏడాదిన్నర కాలంగా నిరసనల పర్వం కొనసాగించి తమకు రావల్సిన పరిహారాన్ని ఎట్టకేలకు అందుకున్నారు.. మాట ఇచ్చి చేతల్లో చూపకపోవడంతో మలి విడత నిరసనలు మొదలు పెట్టిన ఆ రైతులు తమ చేతుల్లో డబ్బులు పడితేనే తప్పుకుంటామని తేల్చిచెప్పారు. రెండు రాష్ట్రాల నడుమ ఇరుక్కున్న సమస్యను పరిష్కరించుకునేందుకు నిరవధిక నిరసనలు చేపట్టి అక్కడి రైతాంగం ఎట్టకేలకు సఫలం అయింది.

మేడిగడ్డ బాధితులు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించింది. ఈ ఆనకట్ట బ్యాక్ వాటర్ లో ముంపునకు గురవుతున్న భూమలపై సర్వే చేసిన తెలంగాణ ప్రభుత్వం తొలి విడుతలో ఎంపికయిన భూమికి పరిహారం అందించలేదు. దీంతో తమకు రావల్సిన రూ. 37 కోట్లు ఇవ్వకపోగా బ్యాక్ వాటర్ లో తమ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని, నాలుగేంఢ్లుగా వ్యవసాయం చేసుకోలేక పోతున్నామని మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాకు చెందిన 12 గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకుని పరిహారం ఇప్పించాలని వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసుగు చెందిన రైతాంగం నిరవధిక నిరసనలకు దిగింది. తాలుకా కేంద్రంలో పలు రకాల నిరసనలు చేపట్టిన ఫలితం కానరాకపోవడంతో సిరొంచ తాలుకా కేంద్రంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆందోళన మొదలు పెట్టారు. సుమారు 42 రోజుల వరకు ఆందోళన చేపట్టిన రైతులు నాగపూర్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలకు తమ జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి సమస్యను వివరించారు. రైతుల నుండి పూర్తి వివరాలు సేకరించిన ఫడ్నవిస్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో నిరసనలు నిలిపివేయడంతో అధికారులు కొన్ని రోజులు హాడావుడి చేసి ఫరిహారం ఇప్పించడాన్ని మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉన్నందున తామేమి చేయలేమని, తాము లేఖ రాశామని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. దీంతో సహనం కోల్పోయిన రైతులు మళ్లీ నిరసన దీక్షలకు పూనుకున్నారు. సుమారు 43 రోజులపాటు దీక్షా శిబిరాన్ని కొనసాగించడంతో మహా సర్కార్ రైతులకు పరిహారం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఖజానా నుండే మిగతా డబ్బు చెల్లిస్తామని మాట ఇచ్చింది. ఈ మేరకు రైతులకు గురువారం నుండి పరిహారం అందించడం ఆరంభించింది మహారాష్ట్ర సర్కారు. ఎంపీ అశోక్ నేతే, ఎమ్మెల్సీ రాందాస్ అంబేడ్కర్ లు సిరొంచ తాలుకా కేంద్రంలో మేడిగడ్డ బాధిత రైతులకు పరిహారం ఇచ్చారు. సిరొంచ తాలుకాలోని 300 రైతుల కుటుంబాలకు పరిహారం అందుతుండడంతో గత నాలుగేళ్లుగా పడుతున్న కష్టానికి తెరపడినట్టయింది.

అక్కడ సభ… ఇక్కడ చెక్కుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందాల్సిన రూ. 37 కోట్లలో 11 కోట్లు మాత్రం ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకపోవడంతో రైతుల నిరవధిక ఆందోళనలతో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడి రైతాంగాన్ని ఆదుకుంటోంది. రూ. 26 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుండి అందకపోవడంతో లేఖలు రాసినా ఫలితం కనిపించకపోవడంతో మహా సర్కార్ తమ రైతులను అక్కున చేర్చుకుని రూ. 26 కోట్లు తన ఖజానా నుండి విడుదల చేసింది. అయితే గురువారం బాధిత రైతులకు మహారాష్ట్ర ప్రభుత్వం సిరొంచ తాలుకా కేంద్రంలో చెక్కులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇదే రోజున విదర్భ ప్రాంత రాజధానిగా ఉన్న నాగపూర్ లో తెలంగాణాలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం గమనార్హం. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను మహారాష్ట్ర సర్కారు ఇస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page