దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ సీనియర్ పోలీసు అధికారి, విజిలెన్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టర్ జనరల్ రాజీవ్ రతన్ హఠన్మారణం చెందారు. మంగళవారం ఉదయం గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన అకాల మరణం పోలీసు విభాగంలో విషాదం నింపింది. 1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. కరీంనగర్ జిల్లా ఎస్పీగా, డీఐజీగా కూడా పనిచేసిన రాజీవ్ రతన్ డీజీపీ బాధ్యతలు ఇచ్చే అంశం కూడా పరిశీలించారు. ఎన్నికల సమయంలో అంజనీ కుమార్ ను స్థానంలో సీనియారిటీ ప్రాతిపాదికన మరోకరిని నియమించాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పుడు రాజీవ్ రతన్ పేరు కూడా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారించే బాధ్యతలను విజిలెన్స్ వింగ్ కు అప్పగించింది. ఈ విభాగం డీజీగా ఉన్న రాజీవ్ రతన్ 15 బృందాలను రంగంలోకి దింపి వివిధ ప్రాంతాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులను సేకరించడంతో పాటు వాటిని స్టడీ చేయించారు. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజ్ లోతుపాతులు తెలుసుకునేందుకు రాజీవ్ రతన్ ప్రత్యేకంగా కాళేశ్వంరలో మకాం వేశారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఇంజనీర్లతో కూడా సుదీర్ఘంగా చర్చింది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదిక తరువాతే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. రాజీవ్ రతన్ హఠాన్మరణం పట్ల రాష్ట్రంలోని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.