దిశ దశ, హైదరాబాద్:
మోటారు వాహన చట్టాలు అమలు చేసేందుకు ఆకస్మిక తనిఖీలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా చేస్తున్న ఆకస్మికంగా రూట్ చెకింగ్ చేపట్టి పలు లారీలపై కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ హైదరాబాద్ రూరల్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో సర్ ప్రైజ్ రూట్ చెకింగ్ ప్రోగ్రాం చేపట్టారు. దుండిగల్ ఎక్స్ రోడ్, మేడ్చల్ జంక్షన్లలో చేసిన ఈ తనిఖీల్లో 19 కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా రోబో సాండ్, బ్రిక్స్, 20ఎంఎం చిప్స్ తరలిస్తున్న 12 లారీలను సీజ్ చేశారు. 10 ఓవర్ లోడ్ కేసులు, మూడు కేసులు పర్మిట్ లేనివి, ఫిట్ నెస్ లేని కేసులు 3, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లారీలు నడుపుతున్న కేసులు 2, ట్యాక్స్ చెల్లించని కేసు ఒకటి నమోదు చేశారు. ఇందుకు గాను రూ. 3,82,509 రూపాయల జరిమానా విధించగా, మైన్స్ అండ్ మినరల్ డెవలప్ మెంట్ రెగ్యూలరైజేషన్ యాక్టు ప్రకారం రాయల్టీ కేసుల్లో 1,03,461 రూపాయల ఫైన్ విధించారు. విజిలెన్స్, ఆర్టీఏ, మైన్స్ విభాగాల అధికారులు జాయింట్ ఆపరేషన్ లో ఈ దాడులు చేపట్టారు.