పబ్జికి బానిసయ్యాడని మందలించినందుకు…

పేరెంట్స్ ను బెదిరించేందుకు మందు తాగి…

తనువు చాలించిన యువకుడు

దిశ దశ, కరీంనగర్:

సాంకేతిక నిపుణుడు కావల్సిన ఆ యువకుడు పబ్జి గేమ్ కు బానిసగా మారిపోయాడు. వద్దని వారిస్తున్న తల్లిదండ్రులను బెదిరించేందుకు పురుగుల మందు తాగి తనువు చాలించాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిని కదలించివేస్తోంది. మృతుని తండ్రి అంజయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… రుక్మాపూర్ గ్రామంలోని ఎల్ రమేష్ ఇంటర్ పూర్తి చేయగా కరీంనగర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు అడ్మిషన్ తీసుకున్నాడు. అయితే కాలేజీలో క్లాసులు స్టార్ట్ కాకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్న రమేష్ స్మార్ట్ ఫోన్ లో పబ్జి గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. ఈ గేమ్ ధ్యాస నుండి బయటపడకపోవడంతో తల్లిదండ్రులు తరుచూ వద్దని వారించే వారు… ఇదే పద్దతిన బుధవారం కూడా రమేష్ ను మందలించి వ్యవసాయం చేసుకునేందుకు వెల్లిపోయారు. ఈ క్రమంలో రమేష్ తన తల్లిదండ్రులను భయపెట్టాలని భావించి గ్రామంలోని కుంట వద్దకు వెల్లి గడ్డి మందు తాగి వాంతులు చేసుకుంటున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన గ్రామస్థులు ఆయన అన్నకు ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సమాచారం అందుకున్న తండ్రి అంజయ్య కూడా హస్పిటల్ కు వచ్చి కొడుకుతో మాట్లాడగా పబ్జీ గేమ్ అడోద్దని చెప్తున్న మిమ్మల్ని బెదిరించాలని భావించి పురుగుల మందు తాగానని, అయితే తానీ పరిస్థితికి చేరుకుంటానని ఊహించలేకపోయానని చెప్పాడు. అయితే చికిత్స పొందుతున్న రమేష్ బుధవారం రాత్రి మరణించగా చొప్పదండి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You cannot copy content of this page