కాళేశ్వరం బాధిత రైతుల దీనస్థితి…
ఆత్మహత్య చేసుకున్న దంపతులు
దిశ దశ, మంథని:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను సస్యశామలం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంత వాసుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఏండ్లుగా పంటలు వేసుకోలేక నరకయాతన పడుతున్న రైతాంగం ఇప్పుడు బలవణ్మరణాల వైపు వెలుతున్నారు. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచుతుండడంతో రైతాంగం ఆందోళణ వ్యక్తం చేస్తోంది. తాజాగా మంథని మండలంలో దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కలకలం సృష్టిస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్ పంచాయితీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ 2ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అన్నారం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. దీంతో బ్యాక్ వాటర్ ఎగ్లాస్ పూర్ గ్రామ వ్యవసాయ భూములను కూడా ముంచెత్తింది. బ్యాక్ వాటర్ కారణంగా పంట నాశనం కావడంతో అప్పులు చేసిన అశోక్, ఆయన భార్య సంగీతలు మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దంపతులు సూసైడ్ చేసుకోవడంతో ఐదేళ్ల వయసు ఉన్న కొడుకు సాయి, నాలుగు ఏళ్లున్న కూతురు సనాలు అనాథలుగా మారిపోయారు. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించకపోవడం వల్లే దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు చెప్తున్నారు.
అధికారుల శాపం…
ఈ పరిస్థితికి ప్రధాన కారణం మాత్రం ఇంజనీర్లేనని చెప్పక తప్పదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించగా ముందు వెనకా ఆలోచించకుండా అంచనాలు తయారు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రాజెక్టు డిజైన్ చేసిన అధికారులు బ్యాక్ వాటర్ ఎంత మేర వస్తుంది, అదనంగా ఎంత భూమిని సేకరించాలి, గేట్లు ఎత్తినప్పుడు వరధ ఉధృతి వల్ల ఎంతమేర పంటలు ముంపునకు గురవుతాయి అన్న విషయాలపై సమగ్రంగా నివేదికలు తయారు చేయలేదని స్పష్టం అవుతోంది. అన్నారం బ్యాక్ వాటర్ లోనే ఓ వైపు నుండి మానేరు, మరో వైపు నుండి గోదావరి నదుల నుండి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. అన్నారం బ్యారేజ్ ఎగువ ప్రాంతం జంక్షన్ పాయింట్ గా ఉందని దీనివల్ల భవిష్యత్తులో పంట భూములు అంచనాలను మించి ముంపనకు గురవుతాయన్న విషయాన్ని విస్మరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆరెంద, మల్లారం ప్రాంత రైతులు అయితే ఐదేళ్ల నుండి వ్యవసాయం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి తయారైంది. మరో వైపున గోదావరి పొంగినప్పుడల్లా అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ ఒత్తిడితో గోదావరి, మానేరు నదుల పరివాహక గ్రామాల్లోని సాగు భూములన్ని కూడా ముంపునకు గురువుతన్నాయి. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు నష్టం గురించి అంచనాలు పంపి పరిహారం అందించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సాంకేతిక నిపుణులు అయిన ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీల నిర్మాణంతో ఎంతమేర భూములు ముంపునకు గురువుతాయోనని ఎస్టిమేట్ వేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఈ ప్రాంతంలో ఏటా ఎదురవుతున్న సమస్యలు ప్రత్యక్ష్య సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి సర్వే జరిపించింది. పొరుగునే ఉన్న మహారాష్ట్ర రైతులు అదనంగా మునిగిపోతున్న తమ పంట పొలాలకు కూడా పరిహారం ఇవ్వాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. బ్యారేజీల్లో నిలువ ఉంచాల్సిన నీరు ఎంత..? ఎగువ ప్రాంతం నుండి వరద పోటెత్తితే మునిగిపోయే పంట పొలాలు ఎంత అన్న విషయంపై సరైన అధ్యయనం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల ఎగువ, దిగువ ప్రాంత పంట భూముల రైతులు నష్టపోతున్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రైతుల ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. యువ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.