బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ టూ టౌన్ లో సుమోటో కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 ప్రకారం క్రైం నెంబర్ 147/2023 తేది ఏప్రిల్ 5న కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. కరీంనగర్ టూటౌన్ సీఐ టి లక్ష్మీబాబు బుధవారం 12.30 నిమిషాలకు ఎఫ్ఐఆర్ జారీ చేయగా వికారాబాద్, హన్మకొండ జిల్లాల్లో పదో తరగతి పేపర్లు లీకయ్యాయంటూ బండి సంజయ్ విద్యార్థుల్లో గందరగోళం నెలకొనే విధంగా మీడియాకు, సోషల్ మీడియాకు స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రజల్లో శాంతియుత పరిస్థితులు లేకుండా చర్యలకు పాల్పడుతున్నారని, అలాగే తనకు వచ్చిన కీలక సమాచారాన్ని బట్టి బండి సంజయ్ తన అనుచరుల ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ఆందోళనలు చేయాలని ప్రయత్నించాడని సీఐ లక్ష్మీబాబు అందులో వివరించారు. రాత్రి తనకు వచ్చిన సమాచారం మేరకు ఆందోళనలు చేపట్టాలని తన అనుచరులకు చెప్తున్నారన్న సమాచారం మేరకు బండి సంజయ్ ని జ్యోతినగర్ లోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసినట్టు సీఐ ఎఫ్ఐఆర్ లో వివరించారు.