ఇసుక తవ్వకాలపై సుప్రీం స్టే…

హై కోర్టు ఉత్తర్వులకు బ్రేక్

తప్పుడు సమాచారం ఇచ్చారు: కర్ణాకర్ రెడ్డి

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలోని ఇసుక తవ్వకాల వ్యవహారం దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 8 ఇసుక రీచుల్లో మైనింగ్ చేయడానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు ఇవ్వగా ప్రత్యర్థిగా ఉన్న టీఎస్ఎండీసీ లంచ్ మోషన్ పిటిషన్ వేసి ఎన్జీటీ ఏక పక్షంగా వ్యవహరించిందని, తమ వాదనలు పట్టించుకోకుండానే స్టే విధించిందని ఇసుక తవ్వకాల కోసం అనుమతులు ఇవ్వాలని కోరింది. దీంతో హై కోర్టు ప్రభుత్వ అవసరాలకు ఇసుక వినియోగించుకోవచ్చని తేల్చి చెప్పింది. కమర్షియల్ గా ఇసుక అమ్మకాలు చేయకూడదన్న నిభందనల ప్రకారం వ్యవహహరించాల్సి ఉంది. అయితే టీఎస్ఎండీసీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధి కర్ణాకర్ రెడ్డి, గడీల రఘువీరారెడ్డిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో హై కోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని కర్ణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. ఎన్జీటీకి సెలవులు లేకున్నప్పటికీ హైకోర్టు పిటిషన్లో సెలవులు ఉన్నాయని వివరించడంతో పాటు కమర్షియల్ గా ఇసుక అమ్మకాలు సాగుతున్నాయన్న అంశాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించడంతో స్టే విధించినట్టుగా ఆయన వివరించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని 8 రీచుల్లో ఇసుక తవ్వకాలు కానీ, క్రయ విక్రయాలు కానీ జరపకూడదని కోర్టు స్పష్టతనిచ్చిందని కర్ణాకర్ రెడ్డి వివరించారు. దీంతో కరీంనగర్ జిల్లాలోని మానేరులో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎక్కడికక్కడ బ్రేకులు పడినట్టయింది.

అంతా నిభందనలకు విరుద్దమే…

అయితే మానేరు నదిలో కొనసాగుతున్న మైనింగ్ వ్యవహారం అంతా కూడా నిభందనలకు విరుద్గంగానే సాగుతోందని మానేరు పరిరక్షణ ప్రతినిధి కర్ణాకర్ రెడ్డి ఆరోపించారు. 3 నుండి 4 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని దీనివల్ల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని ఆయన వివరించారు. భవిష్యత్తు తరాలు కూడా ఈ విధానం వల్ల తీరని నష్టానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాత్రిళ్లు నదిలో మైనింగ్ చర్యలకు పాల్పడుతూ ఇసుకను తరలించుకపోతున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. స్థానిక అవసరాలకు కాకుండా వాణిజ్య పరమైన లావాదేవీలు ఇసుక విషయంలో జరిగినట్టయితే ఖచ్చితంగా ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్(ఈసీ) అవసరమని పర్యావరణ నిభందనలు చెప్తున్నాయన్నారు. ఈ విషయంలో నిభందనల మేరకు నడుచుకోలేదని జాతీయ పర్వావరణ విభాగం నుండి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ తీసుకోలేదని కర్ణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైనింగ్ విషయంలో కూడా హై కోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని ఆయన స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను కలెక్లర్ కార్యాలయంలో కూడా అందిస్తున్నానని కర్ణాకర్ రెడ్డి వివరించారు.

You cannot copy content of this page