ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘంలో నియామకాలను.. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజార్టీతో ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది.
సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు నేడు జస్టిస్ కె.ఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. వీరి నియామకాల కోసం పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఈ త్రిసభ్య కమిటీ అమల్లో ఉంటుందని వెల్లడించింది.
ఒకవేళ ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే, ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ.. సీఈసీల తొలగింపులాగే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పారదర్శకత లేకపోతే వినాశకర పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. రాజ్యాంగ పరిధిలోనే ఎన్నికల కమిషన్ పనిచేయాలని పేర్కొంది. ఎన్నికల కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర సచివాలయం, నిర్ణయాధికారాలు, సొంత బడ్జెట్, అభిశంసన నుంచి రక్షణ ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. నిధుల కోసం ఇప్పటి వరకు ప్రధాని కార్యాలయం, కేంద్ర న్యాయశాఖ కార్యాలయానికి కేంద్ర ఎన్నికల సంఘం వెళ్లాల్సి వచ్చేది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు నేరుగా భారతదేశ ఏకీకృత నిధి నుంచి డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.