పీఎల్జీఏ మెంబర్ మృతి
మావోయిస్టు పార్టీ ఆగ్రహం
జనవరి 11 ఛత్తీస్‌గఢ్ చరిత్రలో మరో బ్లాక్ డేగా మారిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వైమానిక దాడులకు పాల్పడుతూ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని ఎర్రం మెట్టగూడ, బొట్టెటాంగ్ గ్రామాల పొలి మేరల్లో వందల సంఖ్యలో బాంబులతో గగనతలం నుండి దాడులు చేశారని ఆరోపించారు. అంతే కాకుండా బుల్లెట్ల వర్షం కూడా కురిపించారని, ‘సర్జికల్ స్ట్రైక్’ పేరుతో కొత్త ఆపరేషన్ ప్రారంభించారన్నారు. ఎయిర్ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండర్లు హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ విచక్షణారహితంగా కాల్పులకు పాల్డడ్డారని సౌత్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి ఆరోపించారు. PLGA బృందాలు ధైర్యంగా ఎదురు దాడికి పాల్పడి ఆరుగురు కమాండోలను గాయపరిచేలా కాల్పులు జరిపారని వివరించారు. పీఎల్జీఏ కౌంటర్ అటాక్ తో ‘సర్జికల్ స్ట్రైక్’ ఎత్తుగడను తిప్పి కొట్టామని, ఈ ఘటనలో PLGA మెంబర్ పొట్టం హుంగి మృత్యువాత పడ్డారని, చనిపోయిన ఆమెకు మావోయిస్టు పార్టీ నివాళులర్పిస్తోందని ప్రకటించారు. అయితే ఈ ఘటనలో బెటాలియన్ కమాండర్ చనిపోయాడని ప్రచారం జరుగుతోందని, ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలాంటి అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపించారు. బెటాలియన్ కమాండర్ హిడ్మా సురక్షితంగా ఉన్నాడని, కేంద్ర మంత్రి అమిత్ షా, అధికారులు అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు దాసోహం పలికేందుకే సామ్రాజ్యవాదం కొత్త ఆపరేషన్ల పేరుతో వేలాది పోలీసు బలగాలను తమపై ప్రయోగిస్తోందని సమత ఆరోపించారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్ఠం చేశారు. జనవరి 11న ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు వైమానిక దాడులు కొనసాగాయని, ఆకస్మిక బాంబు పేలుడుతో పొలాల్లో పని చేస్తున్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారన్నారు. బస్తర్ డివిజన్‌లో 2021 ఏప్రిల్ నెలలో మొదటిసారిగా గగనతలం నుండి బాంబు దాడి జరిగిందని, 2022 ఏప్రిల్ నెలలో రెండో సారి వైమానిక దాడులు జరిగాయన్నారు. తాజాగా మూడోసారి బాంబు దాడితో పాటు హెలికాప్టర్ల నుండి కాల్పులు కూడా జరిపారని సమత ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లోని సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఈ ఘటనలకు పాల్పడి స్ఫష్టతనిచ్చారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు బస్తర్ డివిజన్‌లో వేల సంఖ్యలో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, లక్షల మంది పారామిలటరీ బలగాలు, పోలీసులను మోహరిస్తున్నారన్నారు. బలగాల మోహరింపుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాదం, దళారీ పెట్టుబడిదారులకు నంబర్-1 ఏజెంట్‌గా మారి దేశ ప్రజల ఆస్తులను, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని సమత ఆరోపించారు. ప్రభుత్వాలు పాల్పడుతున్న విద్రోహ పనులను వ్యతిరేకించే వారిని చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ-అమిత్ షా జోడీ ప్రమాదకరమైన ఉగ్రవాదులుగా మారి ఫాసిస్టు అణచివేతను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడుల వల్ల పీపుల్స్ వార్ ఆగదని, అనాగరిక దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. యువత ముందుకు వచ్చి దేశ భవిష్యత్తును చేతుల్లోకి తీసుకోవాలని, ఇది సఫలం కావాలంటే ప్రజాయుద్ధాన్ని బలోపేతం చేయాలన్నారు.
ఉపాధి పేరిట మోసపోకండి
ఉపాధి కల్పిస్తామంటూ వేలాది మంది యువతను పోలీసుల్లో చేర్చుకుంటున్నారని, కార్పోరేట్ కంపెనీలకు సేవ చేసేందుకు మీ జీవితాలను త్యాగం చేయడం సరికాదని సమత హితవు పలికారు. పోలీసు శాఖలో చేరే యువకులంతా కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఉపాధి కోసం పోలీసుల్లో చేరవద్దని మావోయిస్టు పార్టీ విన్నవిస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విఫలమవుతున్నాయన్న విషయాన్ని గమనించి పోలీసు సిబ్బంది ప్రజలకు అనుకూలంగా ఆలోచించి ప్రజా ఉద్యమానికి సహకరించాలన్నారు.