మావోయిస్టు దంపతుల లొంగుబాటు…

దిశ దశ, కరీంనగర్:

దండకారణ్య అటవీ ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీ దంపతులు పోలీసుల ముందు లొంగిపోయారు. పార్టీలో కీలకమైన కమిటీల అనుభంద సంఘాల్లో పని చేస్తున్న వీరు శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయారు. వరంగల్ ఇంఛార్జి సీపీగా వ్యవహరిస్తున్న కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ ఇంఛార్జి వద్ద సెంట్రల్ కమిటీ టీమ్ మెంబర్ గా పనిచేస్తున్న తిక్క సుష్మిత అలియాస్ చైతే, ప్రొటెక్షన్ కమిటీ సభ్యునిగా పని చేస్తున్న మడ్కం దూల అలియాస్ దూలలు లొంగిపోయారు. సుష్మిత వరంగల్ సమీపంలోని హసన్ పర్తి మండలం సుదంపల్లికి నివాసి కాగా ఆమె తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు పార్టీ సానుభూతిపరునిగా పనిచేస్తున్న క్రమంలో ఇంటర్మీడియెట్ చదువుతుండగా పార్టీకి ఆకర్షితులయ్యారు. 2016లో ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది. చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా, పరియా నివాసి అయిన మడకం దూల @ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. 2008లో మావోయిస్టు పార్టీలో చేరిన తన అన్న ఐయేత చూసి ఆకర్షితుడయ్యాడు. 2015లో ఏరియా కమిటీ మెంబర్ జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో పనిచేస్తున్న వీరిద్దరికి పరిచయం ఏర్పడడంతో 2020 మార్చి 30న పెళ్లి చేసుకున్నారు. రూ. 4 లక్షల చొప్పున రివార్డును వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజిపేట ఏసీపీ పి తిరుమల్, హాసనపర్తి ఇన్స్పెక్టర్ జె సురేష్ పాల్గొన్నారు.

You cannot copy content of this page