గగనంలో సెర్చింగ్ ఆపరేషన్… ధరణీపై కూంబింగ్ ఆపరేషన్…

సరిహద్దు ప్రాంతంలో ఎలక్షన్ స్పెషల్ సెక్యూరిటీ

దిశ దశ, దండకారణ్యం:

పోలింగ్ తేది సమీపిస్తున్నా కొద్ది తెలంగాణ పోలీసులు సరిహద్దు రాష్ట్రాల్లో పకడ్భందీ చర్యలు చేపట్టారు. పొరుగు రాష్ట్రాల నుండి నక్సల్స్ ఎంట్రీ ఇవ్వకూడదన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించిన పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఓ వైపున బార్డర్ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్లు, వెహికిల్ చెకింగ్ వంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్న పోలీసులు తాజాగా డోన్ల సాయంతో సెర్చింగ్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరీ ఈ మేరకు డ్రోన్ కెమరాల ద్వారా నిఘా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఫెర్రి పాయింట్ సమీపంలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. సాంకేతిక సిబ్బందితో పాటు పోలీసులు ఈ మేరకు డ్రోన్లను వినియోగించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రాణహిత, గోదావరి నది తీరమంతా కూడా నిఘాను కట్టుదిట్టం చేసే యోచనలో పోలీసు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిరంతరం డ్రోన్ కెమెరాలు నదీ తీర ప్రాంతాల్లో తిరుగుతూ సుదూర ప్రాంతాల్లో సంచరిస్తున్న వారి కదలికలను రికార్డ్ చేయనున్నాయి. దీంతో సాయుధ నక్సల్స్ కానీ అనుమానితులు కానీ రాష్ట్రం వైపు వస్తున్న విషయాన్ని వెంటనే గమనించి వారిని కట్టడి చేసే యోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఇందు కోసం సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలు, స్థానిక పోలీసులతో డ్రోన్ కెమెరాలను వినియోగించే టీమ్స్ సమన్వయం చేసుకుని ముందుకు సాగనున్నాయి. దీనివల్ల బార్డర్ ఏరియాలో గస్తీ చేస్తున్న బలగాలను ఎప్పటికప్పుడు హై అలెర్ట్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల పేరిట తరుచూ ప్రకటనలు విడుదల అవుతున్న నేపథ్యంలో ఉనికిని కాపాడుకునేందుకు అసెంబ్లీ ఎన్నికలను అడ్వంటైజ్ గా తీసుకోకుండా ఉండేందుకు స్పెషల్ ఎఫర్ట్స్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల నుండి మావోయిస్టులు కానీ సానుభూతి పరులు కానీ, కొరియర్లు కానీ అనుమానితులు ఎవరూ కూడా చొరబడకుండా ఉండేందుకు పకడ్భందీ వ్యూహంతో పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఈ సారి ప్రత్యేకంగా డ్రోన్ కెమారాల నిఘా ద్వారా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.

జాయింట్ ఆపరేషన్లు…

మరో వైపున సరిహద్దు ప్రాంతాల్లో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు తెలంగాణాలోని గ్రే హౌండ్స్, మహారాష్ట్రలోని సి 60, చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలోని డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బలగాలు నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు కూడా నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొనే బలగాల మధ్య ఎప్పటికప్పుడు సమాచారం షేర్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. కో ఆర్డినేషన్ తో మూడు రాష్ట్రాల బార్డర్ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తు నక్సల్స్ ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 30 వరకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page