బాలివుడ్ మూవీ చూసి నకిలీ నోట్లు తయారు చేస్తూ…

ఎస్ఓటీ పోలీసులకు చిక్కిన వరంగల్  జిల్లా వాసులు

దిశ దశ, హైదరాబాద్: 

బాలానగర్ ఎస్ఓటి, అల్లాపూర్ స్టేషన్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ తో నకిలీ కరెన్సీ తయారు చేసే ఇద్దరిని పట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీ నారాయణ బోడుప్పల్ లో నివాసం ఉంటున్నాడు. గతంలో పలు రకాల నేరాలకు పాల్పడిన లక్ష్మీనారాయణపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా ఉండడంతో వనం లక్ష్మీనారాయణ బాలివుడ్ మూవీ ఫర్జీ(FARZI) చూసి నకిలీ కరెన్సీ తయారు చేయడం ఆరంభించాడు. కంప్యూటర్ సైన్స్ చదవిన లక్ష్మీనారాయణకు కంప్యూటర్లు, ప్రింటింగ్ పై పట్టు ఉండడంతో నకిలీ కరెన్సీని తయారు చేసి చెలామణి చేయడం సులవుగా మారింది. ఇందు కోసం స్ర్క్రీన్ ప్రింటర్, గ్రీన్ ఫాయిల్ పేపర్, జెక్ ఎక్సెల్ బాండ్ పేపర్లు, కట్టర్లు, గ్రీన్ ఫాయిల్ పేపర్ ప్రింటింగ్ కోసం లామినేషన్ మిషన్ కొనుగోలు చేశాడు. స్కానర్ ద్వారా అసలు కరెన్సీ నోట్లను ల్యాప్ ట్యాప్ లో స్కాన్ చేశాడు. ఆ తరువాత ఎక్సె ఎల్ బాండ్ పేపర్ పై గ్రీన్ ఫాయిల్ పేపర్ వేసి వేడి చేశాడు. ల్యామినేషన్ పేపర్ తో పేపర్ కు అతికించి స్కాన్ చేసిన నోటును ప్రింట్ చేస్తాడు. స్క్రీన్ ద్వారా కరెన్సీపై వాటర్ మార్క్ కూడా వచ్చేలా సెట్ చేశాడు. తన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా ఓ గదిలో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ఇంట్లోని వారు అటుగా వెల్లకుండా తాళం వేసుకునే వాడు. ఈ నకిలీ కరెన్సీని మార్కెట్లో వినియోగించేందుకు ఎరుకల ప్రణయ్ తో పరిచయం ఏర్పర్చుకున్న లక్ష్మీనారాయణ అతనికి 1:4 రేషన్ ద్వారా కరెన్సీని విక్రయిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. రూ. 50 వేల అసలు కరెన్సీ నోట్లు ఇస్తే రూ. 2 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తానని లక్ష్మీనారయణ ఆఫర్ ఇవ్వడంతో ఎరుకల ప్రణయ్ మొదట రూ. 20 వేలు తీసుకున్నాడు. ఈ నకిలీ కరెన్సీని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మార్పిడీ చేయాలని భావించిన ప్రణయ్ అల్లాపూర్ కూరగాయలు, పండ్ల మార్కెట్ లో చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ప్రణయ్ వద్ద రూ. 500 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రశ్నిచండతో వనం లక్షీనారయణ నుండి తీసుకున్నానని వెల్లడించాడు. వెంటనే బాలానగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసులు బోడుప్పల్ లోని మారుతి నగర్ లో నివాసం ఉంటున్న వనం లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ఈ జాయింట్ ఆపరేషన్ ద్వారా ప్రణయ్ వద్ద ఓ బైక్, రూ. 20 వేల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకోగా, వనం లక్ష్మీ నారాయణ ఇంట్లో రూ. 3 లక్షల 85 వేల విలువ చేసే రూ. 500 నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ప్రింటింగ్ కోసం ఉపయోగించిన పలు వస్తువులను సీజ్ చేశారు. 

You cannot copy content of this page