ఈ సారీ ‘సారీ’నే… కరీంనగర్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్…

దిశ దశ, కరీంనగర్:

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల ఎంపికలో మాత్రం తర్జన భర్జనలు పడుతోంది. ఆశావాహులు తమ అభ్యర్థిత్వం ఖరారయినట్టేనని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆచూతూచి అడుగేస్తోంది. దీంతో కరీంనగర్ లోకసభ అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు టికెట్ ఆశించిన నాయకులు గ్రౌండ్ లెవల్ క్యాంపెయిన్ చేసుకునేందుకు సమాయత్తం అవుతూనే మరో వైపున అధిష్టానం తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఆశావాహులు కూడా తీవ్ర ఉత్కంఠతకు గురవుతున్నారు.

తాజా కమిటీ మీటింగ్…

కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ సోమవారం జరిగింది. ఈ సమావేశంలోనూ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలను హోల్డ్ లో పెట్టేశారు. ఇందులో కరీంనగర్ స్థానం నుండి వెలిచాల రాజేందర్ రావు టికెట్ ఖాయమని అనుకున్న క్రమంలో అనూహ్యంగా ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొదటి నుండి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ గత కొద్ది రోజులుగా సామాజిక వర్గాల సమీకరణాలు, స్థానిక నాయకత్వం అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు టికెట్ ఖాయమని అనుకున్నారంతా. సోమవారం నాటి సీఈసీ భేటీలో ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడంతో స్థానిక నాయకత్వం ఖంగుతింది. వెంటనే అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డితోనూ చర్చలు జరపడంతో మళ్లీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించే అంశాన్ని హోల్డ్ లో పెట్టేశారు. దీంతో కరీంనగర్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలోనన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది.

లోకల్ ప్రయారిటీ..?

అయితే లోకసభ స్థానల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నదే ఫైనల్ నిర్ణయంగా మారిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకోకుండా తాము డిసైడ్ చేసిన క్యాండెట్ వైపే మొగ్గు చూపుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకి వ్యతిరేకంగా మెజార్టీ సెగ్మెంట్ల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే అధిష్టానం మాత్రం ఆయనకే ప్రాధాన్యత ఇచ్చింది. కరీంనగర్ విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page