దిశ దశ, హైదరాబాద్:
ఎన్నికల సమయంలో విధుల నిర్వహణలో ఏ మాత్రం అప్రమత్తత లేకున్నా ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపిస్తుందన్నది వాస్తవం. అధికారుల కదలికలపై డేగ కళ్లతో అబ్జర్వ్ చేస్తున్న భారత ఎన్నికల సంఘం అత్యంత అరుదైన నిర్ణయం తీసుకుని సంచలనం కల్గించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీనే సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం దేశంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెల్చుకున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇంటికి వెల్లి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, సీపీలు సందీప్ శాండిల్య, మహేష్ ఎం భగవత్ లు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఓ వైపున ఫలితాలు ఇంకా వెలువడుతండడంతో పాటు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్ రెడ్డిని కలవడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ గా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనతో పాటు వెళ్లిన పోలీసు కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేష్ ఎం భగవత్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర పోలీస్ బాసునే సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
అప్పుడు బదిలీ వేటు…
తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో అధికారవర్గాలన్ని కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. తాజాగా డీజీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేసినట్టుగా మారిపోయాయి. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆదేశాలు మాత్రం సంచలనగా మారాయి.