నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాతో బాలయ్య తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నాడు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు వరుసగా హీట్ కావడంతో.. బాలయ్య క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది. అయితే క్రేజ్‌కు తోడు బాలయ్యను వివాదాలు వెంటాడుతున్నాయి.
ఇటీవల ఓ కులాన్ని కించపరిచారనే కారణంతో బాలయ్యపై కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. బాలయ్య వారికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ వివాదం మరువకముందే.. బాలయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. అక్కినేని తొక్కినేని, ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ క్రమంలో బాలయ్య వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. బాలయ్య మాట్లాడిన దాంట్లో ఎలాంటి వివాదం కనిపించడం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో దీనిని ఇంకా డ్రాగ్ చేయవద్దని అభిమానులను కోరారు. బాలయ్య తమ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉంటారని, కావాలని వివాదం సృష్టించవద్దని చెప్పారు. తామందరం ఒక ఫ్యామిలీ అని రంగారావు మనవళ్లు పేర్కొన్నారు.
బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అక్కినేని నాగచైతన్య, అఖిల్ స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలు ఖండించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు ఇండస్ట్రీకి మూడు కళ్ల లాంటివారని, వారిని కించపరుచుకోవడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడం అవుతుందని ట్వీట్ చేశారు. అయితే బాలయ్య వ్యాఖ్యలు కొంతమంది వక్రీకరించారని నందమూరి ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య ఫ్లోలో అన్న మాటలను కావాలనే వక్రీకరించి బాలయ్యను తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. బాలయ్య తప్పుగా ఏం మాట్లాడలేదని చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో అక్కినేని, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వివాదం నడుస్తోంది.